20.4 లక్షల ఆసుపత్రి బెడ్స్ కావాలే..
హెల్త్ కేర్ రంగానికి ఇంకా ఎక్కువ స్పేస్ అవసరం
జనాభా పరంగా చూసినా చాలా తక్కువ సౌలతులు
ప్రతి వెయ్యి మందికి మూడు బెడ్స్ ఉండాలి
జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్‌లో మంచి ఫెసిలిటీస్
భారత్‌లోనూ అట్లాంటి అవసరం ఎంతో ఉంది
అంచనా నివేదిక వెల్లడించిన నైట్ ఫ్రాంక్ సంస్థ
దేశంలో హెల్త్ కేర్ రంగానికి 200 కోట్ల చదరపు అడుగుల వైశ్యాలంలో స్పేస్ అవసరం ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. 140 కోట్ల భారత్ జనాభాకు తగిన విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రకారం హాస్పిటళ్లు, వాటిలో బెడ్స్ పరంగా చూస్తే ఇంకా దేశంలో 20.4లక్షల ఆస్పత్రి బెడ్స్ కొరత ఉన్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. దేశంలో ఆస్పత్రి బెడ్స్- జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్రస్తుతమున్న బెడ్స్ ప్రతి 1000 మందికి 1.3 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం ఇవి ప్రతి 1000 మందికి 3 బెడ్స్ ఉండాలి..
ఇతర దేశాల్లో కాస్త బెటర్..
జపాన్‌లో ప్రతి 1000 మంది జనాభాకు 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9, బ్రిటన్‌లో 2.5 బెడ్స్ ఉన్నాయి. వీటితో పోల్చుకుంటే మన దేశంలో జనాభా నిష్పత్తితో ఆసుపత్రి బెడ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మరో వైపు మన దేశ హెల్త్‌కేర్ మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2012లో హెల్త్‌కేర్ మార్కెట్ సైజ్ 73 బిలియన్ డాలర్లుగా ఉంది. అది 2022 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరింది. మన దేశంలో ఈ మార్కెట్ ఇంత భారీగా పెరగడానికి ప్రధానంగా జనాభా పెరుగుదలనే కారణం.
జనాభాలో చైనాను దాటేసినా..
మన దేశం ప్రస్తుతం చైనాను దాటి జనాభాలో అగ్రస్థానానికి చేరుకున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. మన దేశంలో 2021లో జరగాల్సిన జనాభా లెెక్కలు సేకరించకపోవడంతో అధికారింగా ఎంత జనాభా అన్నది తెలియదు. మరో కారణం మన దేశం వేగంగా హెల్త్‌కేర్ టూరిజం కేంద్రంగా వేగంగా ఎదుగుతోంది. మన దేశంలో 2014-2019 కాలంలో విదేశీయులు మెడికల్ వీసాలపై మన దేశంలోకి వచ్చే వారి సంఖ్య ఏటా 30 శాతం చొప్పున పెరిగింది. 2020-21 మెడికల్ టూరిజం ఇండెక్స్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 46 డిస్టినేషన్స్‌లో మన దేశం 10వ ర్యాంక్‌లో ఉంది. మెడికల్ టూరిజం పెరగడానికి మన దేశంలో వైద్య చికిత్సల ఖర్చు తక్కువగా ఉండటమే ప్రధాన కారణం. ఆసియా దేశాలతో పోల్చుకున్నా మన దేశంలో ఇది తక్కువగానే ఉంది. బైపాస్ సర్జరీకి దక్షిణ కొరియాలో 26,000 డాలర్లు ఖర్చయితే, సింగపూర్‌లో ఇది 17,200 డాలర్లు, మన దేశంలో 7,900 డాలర్లు ఖర్చువుతుంది.