Thursday, November 21, 2024

Study: సామాన్యులకు వైద్య విద్య కష్టమే.. ఫీజులు పెంచేస్తున్న ప్రైవేటు కాలేజీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య మరింత ఖరీదుగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు రాని విద్యార్థులు ప్రయివేటులో ఎంబీబీఎస్‌ చేయాలంటే మునుపటి కంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మెడికల్‌ ఫీజులను 99శాతం పెంచుకునేందుకు రాష్ట్రంలోని అన్‌ ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీలకు అనుమతి లభించింది. రాష్ట్రంలో 23 ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో పలు వైద్య కోర్సుల ఫీజులను పెంచుకునే అవకాశాన్ని వైద్య ఆరోగ్యశాఖ ఆయా కాలేజీల యాజమాన్యాలకు కల్పించింది. రాష్ట్రంలోని 23 ప్రయివేటు కాలేజీల్లో 8 ప్రయివేటు కాలేజీలు ఎంబీబీఎస్‌ వైద్య విద్య, బీడీఎస్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కాలేజీల్లో కోర్సుల ఫీజును ఇప్పుడున్న 72శాతం నుంచి 90శాతానికి పెంచుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఇటీవల 41, 43 జీవోలను జారీ చేసింది. విద్యా సంవత్సరం 2021-22 నుంచి పెంచిన వైద్య విద్య ఫీజులు అమలులోకి రానున్నాయి.

ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు తమ వ్యయాల తాలూకు నివేదికను సమర్పించటంతో దాని ఆధారంగా వైద్య, ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే నిర్ణయించిన ఫీజుల్లో పెంపు ఉండకపోగా… రానున్న నాలుగున్నరేళ్ల వైద్య విద్య కోర్సులో విద్యార్థులు పెంచిన మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. గడిచిన 2016లో మెడికల్‌ కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించారు. వైద్య విద్యా కోర్సులకు ఫీజులు పెరిగిన కళాశాలల్లో కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్‌ కాలేజీ, ఎల్‌బీనగర్‌లోని కామినేని అకాడమీ, కామినేని ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌-నార్కట్‌పల్లి, ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ-మహబూబ్‌నగర్‌ ఉన్నాయి. ఈ కాలేజీల్లోని బీ కేటగిరి సీట్లకు ఫీజును 13లక్షల దాకా పెంచారు. అపోలో, మల్లారెడ్డి, ఎస్‌వీఎస్‌ మెడికల్‌ కాలేజీల్లో బీ కేటగిరి వైద్య విద్యా కోర్సులకు రూ.12.50లక్షల మేర, సీ కేటగిరిలో రూ.25లక్షల మేర ఏడాదికి గాను ఫీజులను పెంచారు. ఎంఎన్‌ఆర్‌ , పనానియా డెంటల్‌ కాలేజీల్లో రూ. 5లక్షల మేర ఫీజులు పెరిగాయి.

రాష్ట్రంలోని ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపును వైద్య విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ప్రయివేటులో ఎంబీబీఎస్‌ చేయాలంటే కోట్లలో ఖర్చవుతోందని, ప్రస్తుతం వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయంతో ఇక రాష్ట్రంలో ప్రయివేటులో ఎంబీబీఎస్‌ చదవటం దాదాపు అసాధ్యమని అంటున్నారు. మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపును హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగాచేశారని ఆరోపిస్తున్నారు. 2016లో నిర్ణయించిన ఫీజులనే ప్రయివేటు మెడికల్‌ కాలేజీలు వసూలు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement