భారత్‌లో వైద్య విద్య ప్రియం కావడంతో ఈ కోర్సును చదివి వైద్యులుగా రానించాలన్న కలను సాకారం చేసుకునేందుకు వందల మంది విద్యార్థులు ఏటా ఉక్రెయిన్ వెళుతుంటారు. మన దేశంలో వైద్య విద్యను అభ్యసించాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా నేషన్ ఎలిజిబులిటీ అండ్ ఎంట్రన్స్ టెస్డు (నీట్)లో అర్హత సాధించాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 80వేల వైద్య సీట్లు అందుబాటులో ఉండగా 18 లక్షల మంది విద్యార్థులు ఏటా ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు. మన దేశంలో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ చేయాలంటే నాలుగున్నరేళ్లకు కలిపి కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఫీజులను కట్టే పరిస్థితి లేకపోవడంతో భారత విద్యార్థులు ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చదివేందుకు ఉక్రెయిన్, పిలిప్పిన్స్, రష్యా దేశాలకు వెళుతుంటారు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉక్రెయిన్‌లో హాస్టల్ వసతి కలుపుకుని రూ.40 లక్షలతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా రెండు వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ వెళుతుంటారని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో దాదాపు 50 వైద్య కళాశాలలు ఉన్నాయి. 19 వర్సిటీలకు భారత వైద్య మండలి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కీవ్, లుగాన్‌స్కీ, బ్లాక్‌సీ, డొనెస్క్, ఖర్కివ్, జాపోర్జియా, డాన్‌లో, హలేస్కిలిల్, బుకోవిలియన్ తదితర వర్సిటీల్లో చదువుకునేందుకు మొగ్గు చూపుతుంటారు.
విద్యార్థుల తరిలింపు షురూ
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. ఉక్రెయిన్ నుంచి పోలండ్ మీదుగా ఢిల్లికి వెళ్లే 40 మంది విద్యార్థులు ఇప్పటికే రొమేనియా సరిహద్దులకు చేరుకున్నట్టు భారత రాయబారా కార్యాలయం అధికారులు తెలిపారు. మరో విద్యార్థి బృందం కూడా సరిహద్దులకు చేరుకుంటోందని చెప్పారు. వీరంతా డయని విశ్వవిద్యాలయానికి చెందిన వారుగా వారు పేర్కొన్నారు. సరిహద్దులకు చేరుకున్న విద్యార్థులు గూగుల్ మ్యాప్ ఆధారంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. విశ్వవిద్యాలయాలకు చెందిన బస్సుల ద్వారా విద్యార్థులను చేరవేస్తున్నారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని ప్రాంతాల నుంచి విద్యార్థులను తరలిస్తున్నారు.
ఇక్కడ రాయబార కార్యాలయం అధికారులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు భోజన, మంచినీటి వసతి కల్పిస్తుండడంతో పాటు వారికి అవసరమైన ఇతర వాటిని సమకూరుస్తున్నారు. అయితే రొమేనియా, హంగేరీయాల మీదుగా విమానాలను నడుపుతుండడంతో ఇక్కడికి చేరుకునేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న సరిహద్దులను చేరుకోవాలంటే కనీసం రెండు రోజులైన పడుతుందని ప్రస్తుత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సరిహద్దులకు వెళ్లడం కష్టసాధ్యమని వారంటున్నారు. భారత జాతీయ పతాకాన్ని వాహనాలకు అమర్చి సరిహద్దులకు రాయబార కార్యాలయం అధికారులు చెబుతున్నా గమ్యస్థానాలకు చేరుకోవడం అంత సులువు కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచి పోలండ్‌కు చేరుకోవాలంటే కనీసం 24 గంటల సమయం పడుతుందని అది కూడా రోడ్డు మార్గాన కాకుండా రైలులో వెళ్లాల్సి ఉంటుందని కీర్తి అనే విద్యార్థిని చెప్పారు.
రోడ్డు మార్గాన వెళ్లడం ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్కారం కాదని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టెలిగ్రామ్, వాట్సప్‌ల ద్వారా భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందిస్తోందని అందుకు అనుగుణంగా తాము స్థావరాలను మారుస్తున్నామని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతున్నా తాము మాత్రం స్వదేశానికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదని చెప్పారు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.