Monday, November 18, 2024

Big Story: మెడికల్ దందా.. బ్రాండెడ్‌ పేరుతో నాసిరకం మందులు

తెలంగాణలోని మెడికల్‌ షాపుల్లో ఫార్మా చట్టాలకు విరుద్ధంగా మందుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యంతో మెడికల్‌ మాఫియా చెలగాట మాడుతోంది. మందుల చీటి లేకున్నా ఫరవా లేదు. డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ ఉన్నా… మెడికల్‌ షాప్‌ సిబ్బందే వేదం చేసిందే శాసనం. ఆ మందు ఈ మందు అనే తేడా లేదు. వైద్యుడి రాసిన చీటి లేకుండానే బ్రాండెడ్‌ పేరిట నం.2, షెడ్యూల్‌ హెచ్‌ డ్రగ్స్‌కు చెందిన అసలు మందులతోపాటు నకిలీ మందులను రాష్ట్రంలోని మెడికల్‌ షాపులు యథేచ్ఛగా అమ్మేస్తున్నాయి. ఔషధాలను ఎంఆర్‌పీ రేటు కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నాయి. కొన్న మందులకు రోగులకు బిల్‌ కూడా ఇవ్వటం లేదు. ఇదీ తెలంగాణలోని ప్రతి చిన్న పట్టణం మొదలు రాజధాని హైదరాబాద్‌ దాకా మెడికల్‌ షాపులు చేస్తున్న మాఫియా మాయాజాలం.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రోగులను పరీక్షించి వ్యాధిని నిర్ధారించి వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్‌ ఉంటేనే మెడికల్‌ షాపుల్లో మందులు అమ్మాలి. కాని ఎలాంటి ప్రిస్కిప్షన్‌ లేకున్నా రోగి ఏ మందు అడిగితే అది ఇచ్చేస్తున్నారు. వినియోగదారులకు అమ్మే మందులకు ఎలాంటి బిల్లులు ఇవ్వటం లేదు. ఒకవేళ ఆ మందులు వికటిస్తే తాము అమ్మలేదని బుకాయిస్తున్న ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. కీలకమైన డ్రగ్స్‌ లేకుండానే తక్కువ ఉత్పత్తి వ్యయంతో తయారు చేసిన మందులను హోల్‌సేల్‌ వ్యాపారులు రిటైల్‌ వ్యాపారులకు అతితక్కువ ధరకే అమ్ముతున్నారు. అసలు మందుల ధరల కంటే ఈ మందుల ధరలు దాదాపు 70శాతం తక్కువ ధరకు మెడికల్‌ షాపులకు లభిస్తున్నాయి. ఈ నాసిరకం ఔషధాలను బ్రాండెడ్‌ మెడిసిన్‌ ధరలతో రోగులకు అంటగడుతున్నారు. కొన్ని ఫార్మా ఉత్పత్తి కంపెనీలు, మెడికల్‌ షాపులు అయితే తాము తయారు చేసిన మందులనే రాసేలా వైద్యులకు నజరానాలు ఇస్తున్నాయి.

ఫార్మసీ సర్టిఫికెట్‌ లేకుండానే మెడికల్‌ షాపులు
రాష్ట్రంలో దాదాపు 40వేల ప్రయివేటు మెడికల్‌ షాపులు ఉన్నాయి. మెడికల్‌ షాపును నెలకొల్పాలంటే ఔషధ నియంత్రణశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. మెడికల్‌ షాపు ఏర్పాటు చేయాలంటే ఫార్మసీ సర్టిఫికెట్‌ అవసరం ఉంటుంది. ఆ సర్టిఫికెట్‌ ఆధారంగానే ఔషధ నియంత్రణశాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఫార్మసీ సర్టిఫికెట్‌ లేకున్నా, ఇతరత్రా నిబంధనలు పాటించకుండానే కొత్త మెడికల్‌ షాపులకు ఔషధ నియంత్రణశాఖ లైసెన్సులు ఇస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫార్మసీ చదివాక ఉన్నత చదువులు చదివేవారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని లైసెన్సు కోసం దరఖాస్తు చేస్తున్నారు. సర్టిఫికెట్‌లో ఉన్న ఫార్మాసిస్టు పేరుతోనే లైసెన్సు మంజూరవుతోంది. సదరు ఫార్మాసిస్టు మెడికల్‌ షాపులో తప్పనిసరిగా ఉండాలి. ఒక్కసారి అనుమతి వచ్చాక ఫార్మాసిస్టు ఆ మెడికల్‌ షాపులో దర్శనం ఇవ్వటం లేదు. అవగాహన లేనివారితో మందుల అమ్మకాలు జరుపుతున్నారు. మెడికల్‌ షాపు పేరిట లైసెన్సు తీసుకుని మెడికల్‌ అండ్‌ జనరల్‌ షాపులను నడుపుతున్నారు.

మామూళ్ల మత్తులో ఔషధ నియంత్రణశాఖ
ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం మెడికల్‌ షాపులను తనిఖీ చేయాల్సిన రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఏడాదికి ఒక్కసారి కూడా తనిఖీ చేయటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఠంచన్‌గా మామూళ్లు అందుతున్నందునే అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్‌ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

నియంత్రణ లేకపోతే అనర్థాలు – డా. నరహరి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం.
రాష్ట్రంలో మెడికల్‌ షాపులపై నియంత్రణ లేకుండా పోతోంది. వైద్యుడి ప్రిస్కిప్షన్‌ లేకుండానే కౌంటర్‌ సేల్స్‌ యథేచ్చగా కొనసాగుతున్నాయి. మెడికల్‌ షాపు ఒకరి పేరు మీద ఉంటే అందులో రోగులకు మందులు అమ్మేవారు మరొకరు. మందులు అమ్మేవారికి ఎలాంటి ఫార్మాసీ క్వాలిఫికేషన్‌ కాని, ఔషధాలపై కనీస అవగాహన ఉండటం లేదు. ప్రిస్కిప్షన్‌లో బ్రాండెడ్‌ మందులనే వైద్యుడు రాసినా… ఆ పేరుతో తమ వద్ద ఉన్న మందులనే రోగులకు మెడికల్‌ షాపుల యజమానులు అంటగడుతున్నారు. దీంతో రోగులకు వ్యాధులు త్వరగా తగ్గటం లేదు. వ్యాధి తీవ్రత ముదిరి… ప్రాణాలకే ప్రమాదమేర్పడుతోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఔషధ నియంత్రణశాఖ నియంత్రణ అనేది ఎంతో అవసరం.

Advertisement

తాజా వార్తలు

Advertisement