కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ పాదయాత్ర మహారాష్ట్రలోని వాషిమ్ లో కొనసాగుతుంది..కాగా ఈ యాత్రలో మేధా పాట్కర్ తో రాహుల్ గాంధీ కలిసి నడిచిన ఫొటోలు వైరల్ గా మారాయి. పాట్కర్‌ను రాహుల్ గాంధీ తన పాదయాత్రలో సన్నిహితంగా కలిశారు. తద్వారా గుజరాతీ ప్రజలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరోసారి కాషాయ దళానికి తమ ఓటును వేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుండగా.. అంది వచ్చిన అవకాశాన్ని ఎలా అయినా ఉపయోగించుకోవాలనే యోచనలో గుజరాత్ బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
అయితే గుజరత్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినవారితో రాహుల్ గాంధీ చేతులు కలిపారని.. మేధా పాట్కర్ గుజరాతీ వ్యతిరేకి అని బీజేపీ ఆగ్రహించింది. ఈ మేరకు కమలం పార్టీ రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద మండిపడింది. ‘‘గుజరాత్, గుజరాతీల పట్ల కాంగ్రెస్, రాహుల్ గాంధీ పదే పదే తమ వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. మేధా పాట్కర్‌కు తన యాత్రలో కేంద్ర స్థానం కల్పించడం ద్వారా, దశాబ్దాలుగా గుజరాతీలకు నీళ్లు ఇవ్వని వారితో తాను నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పకనే చెప్తున్నారు. దీన్ని గుజరాత్ సహించదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గుజరాత్‌లో 2017లో ప్రారంభమైన సర్దార్ సరోవర్ డ్యామ్‌కు వ్యతిరేకంగా మేధా పాట్కర్ ప్రచారం చేశారు. పాట్కర్ ‘నర్మదా బచావో’ అనే పేరుతో ఆందోళన చేపట్టి, ఆ డ్యామ్ నుంచి వచ్చిన నీరు వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేస్తుందని ఆమె అన్నారని బీజేపీ గుర్తు చేసింది.