మేడారం జాతరకి వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు మేడారం భక్తుల కోసం 3,845ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. కాగా ప్రతీ ఆదివారం హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులను ఇప్పటికే ప్రారంభించింది ఆర్టీసీ. ఒక్కో ప్రయాణికుడికి హైదరాబాద్ నుండి మేడారం వెళ్ళడానికి రూ. 405వసూలు చేస్తోంది. కాగా ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరుగబోతోంది.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా… ఒడిశా, చత్తీస్ గడ్, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తుంటారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. ఇదిలా ఉంటే తెలంగాణలోని ప్రతీ పట్టణం, మండలం కేంద్రం నుంచి మేడారానికి ప్రత్యేకంగా బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసి. రెండేళ్లకోసారి జరిగే ఈ గిరిజన కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి రంగం సిద్దమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..