మేడారం మహాజాతర శనివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు వడ్డెలు గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, అమ్మవార్ల వన ప్రవేశంతో మహాజాతర ముగుస్తుంది. చివరిరోజు అమ్మవార్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మేడారానికి చేరుకోనున్నారు. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మేడారం రానున్నారు. గట్టమ్మ వద్ద నుంచి ర్యాలీగా మేడారం వచ్చేందుకు 200 వాహనాలను కార్యకర్తలు సిద్ధం చేస్తున్నారు.
మేడారం జాతరలో మూడో రోజు కూడా అదే జోరు కొనసాగింది. సమ్మక్క గురువారం రాత్రి గద్దెపైకి చేరిన తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం భక్తులు మేడారానికి పోటెత్తారు. రెండు రోజులుగా 75 లక్షల మంది రాగా.. శుక్రవారం 25 లక్షల మందికిపైగా వచ్చినట్టు అధికారులు తెలిపారు. లక్షలాదిగా భక్తులు రావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అమ్మల దర్శనానికి రెండు గంటలు పడుతోంది. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంలోగా మరో 10 నుంచి 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.