ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర నాలుగు రోజుల పాటు భక్త జన సందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తో పాటు ఇతర రాష్ట్రాలు, దేశ నలుమూలల నుండి సుమారు కోటి నలభై లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి దేవతలను దర్శించుకుని మొక్కులు, కానుకలు సమర్పించుకున్నారు. భక్తులు కానుకల సమర్పించుకునెందుకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో 497 హుండీలను ఏర్పాటు చేయగా భక్తులు ఆ హుండీలలో ఒడువాల బియ్యంతో పాటు ఆభరణాలు, నగదు సమర్పించుకున్నారు.
కాగా సోమవారం ఆలయ ఈఓ టి. రాజేంద్రం ఆధ్వర్యంలో 6 ఆర్టీసీ బస్సులలో 497 హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించారు. బుధవారం ఉదయం 9 గంటల నుండి హుండీల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఈఓ తెలిపారు .