– ప్రభ న్యూస్, ఉమ్మడి మెదక్ బ్యూరో
మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందిన రైతు మహిపాల్ రెడ్డి(37) తనకున్న 40 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండించాడు. ఎనిమిది ఎకరాల్లో కేవలం టమాటా మాత్రమే సాగు చేశాడు. బాగా ఎండల సమయంలో టమాటా పంట వేసినప్పటికీ.. షెడ్ నెట్స్ ఉపయోగించి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక ఎప్పుడైతే మార్కెట్‌లో టమాటా ధర అమాంతం పెరిగిందో ఆ సమయానికి మహిపాల్ రెడ్డికి కూడా పంట చేతికొచ్చింది. తాను పండించిన టమాటాను అమ్మి ఈ నెల రోజుల వ్యవధిలోనే కోటీశ్వరుడయ్యాడు. ఈ మధ్య కాలంలోనే టమాటాలు అమ్మకం ద్వారా ఏకం రూ. 1.80 కోట్లు సంపాదించాడు మహిపాల్ రెడ్డి.
కౌడిపల్లి నుంచి పటాన్‌చెరు, షాపూర్, బోయిన్‌పల్లి మార్కెట్లకు మహిపాల్‌రెడ్డి టమాటాను తరలించి విక్రయించినట్లు తెలిపాడు. 20 ఏండ్ల నుంచి కూరగాయలు పండిస్తున్నా ఇట్లాంటి లాభాలు ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే కోటి రూపాయాలు సంపాదించడం తనకు, తన కుటుంబానికి ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇదంతా తమకు ఆశ్చర్యంగా కూడా ఉందని చెబుతున్నాడు.
ఈ సీజన్‌లో మొత్తం 7 వేల బాక్సుల టమాటాను అమ్మినట్టు తెలిపాడు మహిపాల్‌రెడ్డి. ఒక్కో బాక్సును రూ. 2,600కు అమ్మినట్టు చెప్పాడు. ఈ యువ రైతు పదో తరగతి ఫెయిల్ అయినా.. ఆ తర్వాత వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. తన భార్య సహకారంతో కూరగాయల సాగు ప్రారంభించాడు. మొత్తంగా 20 ఏండ్ల తర్వాత మహిపాల్ రెడ్డి పంట నిజంగానే పండిందని చెప్పాలి. మహిపాల్ భార్య బాన్సువాడ దివ్య మహమ్మద్ నగర్ సర్పంచ్‌గా కొనసాగుతున్నారు.