Saturday, November 23, 2024

క‌ల్లోలిత ప్రాంతంలో జ‌ల‌సంద‌డి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంగా ఉద్యమించిన ఆదివాసీ ప్రాంతాల్లో సాగునీరు ప్రవహిస్తూ సమస్యలను పరిష్కరిస్తు న్నది. ఉద్యమాలకు ఊపిరిగా, ఆదివాసి పోరా టాలకు నెలవుగా ఒకప్పుడు ఉన్న కల్లోలిత ప్రాం తాల్లో సాగునీరు సవ్వడిచేస్తూ ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా అవతరించగానే గతకాలపు విధానా లను తోసి నూతన జలవిధానాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించడంతో బీడుభూములు నేడు సాగు కు యోగ్యమయ్యాయి. కొండ కోనల్లో నివసిస్తూ అడవి దినుసులపై ఆధారపడిన ఆదివాసీలు వ్యవసాయంలో నిమగ్నమయ్యారు. పట్టణీకర ణకు అందనంత
దూరంలోని జనవాసాలకు తాగు, సాగునీరు అందడంతో మారుమూల ప్రాంతాల ఆదివాసీలు వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రతిభ చాటుకుంటున్నారు.

దట్టమైన దండకారణ్యంలోని తాంసీ మండలంలోని జనవాసాలు ఒకప్పుడు అడవి ఉత్పత్తులే జీవనాధారంగా బతుకులను వెల్లదీశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. సాగునీటి ప్రణాళికలు వేసి ఆ తర్వాత మర్చిపోయిన పాలకులను చూసిన జనం అక్కడ నివశిస్తుండేది. అయితే ఇది గతకాలపు స్మృతి తెలంగాణ ఆవిర్భవించగానే సీఎం కేసీఆర్‌ సాగునీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతతో ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం జలసవ్వళ్లు వినిపిస్తున్నాయి. గత సమైక్య పాలకులు తాంసి మండలం వడ్డాది గ్రామంలోని మత్తడి వాగుపై సాగునీటి ప్రాజెక్టును ప్రతిపాదించి భూసేకరణ సమస్యలతో నిర్మాణ పనులను నిలిపివేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా కల్లోలిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన ప్యాకేజీ కింద మత్తడి వాగు ప్రాజెక్టును పనులకు నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో పాటు ప్రాజెక్టును ఇతరప్రాంతాలకు తరలించాలని ఆదివాసీలు అందోళన చేయడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి.

అయితే ఆయకట్టు రైతుల ఆక్షేపణలను పరగణలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలువల తవ్వకాలను నిలిపివేసి గిరిజనులకు ఆమోదయోగ్యంగా సొరంగమార్గాలను నిర్మించి మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేసింది. ఆదిలాబాద్‌ మండలంలోని 12 గ్రామాలు, తాంసీ, భీంపూర్‌ మండలలోని 8 వేల 500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. బిందు సేద్యానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ కావల్సిన పైపులైన్లను ఏర్పాటు చేస్తుండటంతో 12వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. రైలు లైను ప్రాజెక్టు కాలువలకు అడ్డంగా ఉండటంతో కల్వర్ట్‌ నిర్మాణ పనులను కూడా పూర్తి చేశారు.

సాగునీటి కాలువల నిర్మాణాలతో పాటుగా తుంపర సేద్యానికి అవసరమైన గ్రావిటీ పంపింగ్‌ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ప్రెజర్‌ పంపింగ్‌తో భూగర్భ పైపుల ద్వారా సూక్ష్మ సాగునీటి వ్యవస్థకు అవసరమైన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నీటి పంపింగ్‌ కోసం అవసరమైన ప్రవాహాన్ని పంపింగ్‌ చేసేందుకు 9 కిలోమీటర్ల పొడవునా పైపులైన్‌ వేస్తున్నారు. ఆరంభంలో 450 మి.మీ, తర్వాత 350 మి.మీ. చివర్లో 90 మి.మీ వ్యాసార్థ్యంతో 25బ్లాకులుగా విభజించి 200 అవుట్‌ లెట్ల ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భంలో హెచ్‌డీపీఈ పైపులను ఏర్పాటు చేస్తున్నారు. సివిల్‌ పనులు వేగంగా జగుగుతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు కావల్సిన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం 8వేల 500 ఎకరాలకు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తుంపర సేద్యం పనులు పూర్తి చేస్తే 12000 ఎకరాల వరకు సాగుకు యోగ్యంగా మత్తడి వాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు నీటి ప్రవాహం పంటపొలాల్లో పరవళ్లు తొక్కనుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.65 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మిగతా పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జనవాసాలకు దూరంగా ఉన్న గిరిజన, ఆదివాసీ తండాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతతో వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement