ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో వర్షం రావడంతో టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. అడిలైడ్ లో వర్షం పడడంతో ప్రస్తుతానికి ఆట నిలిచిపోయింది. ఆట ఆగిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు టీమిండియా 185 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇక.. ఈ కీలక మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (50), విరాట్ కోహ్లీ 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇక.. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోతే డీఆర్ఎస్ (డక్‌వర్గ్ లూయీస్) విధానంలో బంగ్లాదేశ్ జట్టే విజేతగా నిలిచే చాన్సెస్ ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు. మ్యాచ్ ఆగిపోయిన సమయానికి డీఆర్ఎస్ సమీకరణం ప్రకారం బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 49 పరుగులు చేస్తే చాలు. అయితే ఆ జట్టు అనుకున్నదానికంటే మరో 17 పరుగులు ఎక్కువే చేసింది.
భారీ స్కోరు చేజింగ్ లో బంగ్లాదేశ్ జట్టు ఓపెనర్ లిట్టన్ దాస్ రెచ్చిపోయాడు. 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న నజ్ముల్ హుస్సేన్ శాంటో 7 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ ఓపెనింగ్ జోడీపై టీమిండియా బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకోయారు.