మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన త్రికూట కొండలపై ఉన్న ఆలయ గర్భగుడి వెలుపల చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా శనివారం తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇంతలో తొక్కిసలాట జరిగింది. జిల్లా అధికారులు, ఆలయ బోర్డు అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. పలువురు వ్యక్తులు చనిపోయారని వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు తీవ్రంగా గాయపడ్డ మరో 26 మందిని మాతా వైష్ణో దేవి నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సహా ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఉన్నారు.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్‌తో మాట్లాడిన ప్రధాని.. బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు… గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వనున్నారు.