భారతీయులు ప్రపంచదేశాలలో స్థిరపడిన వారు చాలా మందే వున్నారు. వారు ఎక్కడ వున్నా మూలాలు మాత్రం ఇండియాలోనే ఉంటుంటాయి. అదే తరహాలో రాజాచారి పేరు మారుమోగుతోంది. మరి ఎవరీ రాజాచారి తెలుసుకుందాం..ఈయన మూలాలు తెలంగాణలోని మహబూబ్ నగర్ లో వున్నాయి. వీరిది విద్యా వేత్తల కుటుంబం. రాజాచారి తాత ఉస్మానియా వర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్. రాజాచారి తండ్రి ఉస్మానియా నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన శ్రీనివాస్ చారి అమెరికాకు చెందిన అమ్మాయి (పెగ్గీ ఎగ్బర్ట్)ని వివాహం చేసుకున్నారు. రాజాచారి అమెరికాలోనే జన్మించారు.
రాజాచారి ప్రతిష్ఠాత్మక ఎంఐటీ నుంచి ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆపై అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఉన్నతస్థాయి అధికారిగా పనిచేశారు. ఆమెరికా నేవీ టెస్ట్ స్కూల్ పైలెట్ కోర్సు కూడా విజయవంతంగా పూర్తి చేశారు. నాలుగేళ్ల కిందట నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. తన రోదసి యాత్ర కలను తాజాగా స్పేస్ ఎక్స్ ద్వారా నెరవేర్చుకున్నారు. రాజాచారికి ఇదే తొలి అంతరిక్ష యాత్ర. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ రోదసీ యాత్రల సంస్థ తాజాగా ఎండ్యూరెన్స్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపింది. ఈ నౌకలో భారత సంతతికి చెందిన రాజాచారి కూడా ఉన్నారు. భూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఐఎస్ఎస్ (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో రాజాచారి ఆరు నెలల పాటు ఉండనున్నారు. రాజాచారితో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు కూడా స్పేస్ ఎక్స్ ఎండ్యూరెన్స్ వ్యోమనౌకలో రోదసిలో ప్రవేశించారు. వీరు ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్ ను నేడు ఐఎస్ఎస్ తో అనుసంధానం (డాకింగ్) చేయనున్నారు. ఈ రోదసియాత్రకు కమాండర్ గా వ్యవహరిస్తున్నారు రాజాచారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily