రష్యాకి భారీ నష్టం జరిగిందట. ఉక్రెయిన్ పై దాడులు చేస్తోన్న రష్యా దాడికి వెళ్లిన సైనిక దళాల్ని చాలా వరకు కోల్పోయినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి నేటితో 44 రోజులు అవుతోంది. దీనిపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందించారు. బ్రిటీస్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. భారీ స్థాయిలో దళాల్ని కోల్పోయామని, ఇది విషాదకరమని ఆయన అన్నారు. అయితే త్వరలోనే తమ యుద్ధ లక్ష్యాలను అందుకోనున్నట్లు ఆయన చెప్పారు. కీవ్‌ను టార్గెట్ చేసుకుని ఆక్రమణకు వెళ్లిన రష్యా.. ఇప్పుడు తన ఫోకస్‌ను తూర్పు వైపు నిలిపింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం మండలి నుంచి రష్యాను వెలివేసిన తర్వాత పెస్కోవ్ తాజా అభిప్రాయాలను వెల్లడించారు. బుచ్చా మారణకాండ నేపథ్యంలో మానవ హక్కుల మండలి రష్యాపై ఆ నిర్ణయం తీసుకున్నది. అయితే ఆ తక్షణమే రష్యా కూడా ఆ మండలికి రాజీనామా చేసింది. సుమారు 1,351 మంది సైనికులు మృతిచెందినట్లు రష్యా మార్చి 25వ తేదీన అంగీకరించింది. మరో వైపు రష్యా 19వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. కానీ పశ్చిమ దేశాలు మాత్రం మరో సంఖ్యను చెబుతున్నాయి. ప్రస్తుత యుద్ధంలో రష్యా సుమారు ఏడు వేల నుంచి 15 వేల మంది సైనికుల్ని కోల్పోయి ఉంటుందని పశ్చిమ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement