రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గిన నేపథ్యంలో మాస్కుల వినియోగం దాదాపు అటకెక్కింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు చాలా వరకు మాస్కులను ధరించడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ చేస్తూ దేశాన్ని గడగడలాడిస్తోంది. దీంతో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేసి కోవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే మార్గదర్శకాలను మరోసారి జారీ చేసింది. తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో సంచరించే వారికి రూ.100 జరిమానాను అధికార యంత్రాంగం విధించనుంది.
అలాగే మాస్కులు లేకుండా షాపింగ్ మాల్స్, దుకాణాలు, సినిమా హాల్స్‌లోకి అనుమతిస్తే ఆ సంస్థల యాజమాన్యాలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వ్యాపార సంస్థలను రెండ్రోజుల పాటు మూసివేస్తామని హెచ్చరించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ప్రభుత్వానికి తెలియ జేయాలని సూచించింది. దీనికోసం 8010968295 నెంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. కోవిడ్ మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో అమలు జరిగేలా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital