Monday, November 25, 2024

Intresting Story: చంద్రకళకు పెళ్లి.. కళ్యాణలక్ష్మికి స్ఫూర్తి ఆమె తల్లి..

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: కళ్యాణ లక్ష్మి…పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఓ వరం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రంలోని పేదింటి ఆడపిల్లలకు మేనమామగా మారి ఇస్తున్న కట్నం.. కొట్లాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన గొప్ప పథకం కళ్యాణ లక్ష్మి. గడిచిన ఏడేళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది పైచిలుకు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళకు ఈ పథకం చేదోడుగా నిలిచింది. ఈ పథకం క్రింద పెళ్లికూతురుకు రాష్ట్ర ప్రభుత్వం 1లక్ష116 రూపాయలు అందిస్తున్నది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమల్లోకి వచ్చిన ఈ పథకం గత ఏడు సంవత్సరాలుగా యాధాతథంగా కొనసాగుతోంది. ఈ పథకం ప్రవేశపెట్టడానికి కారణమైంది… ఓ గిరిజన జంట ఆమె పేరే కల్పన. టీఆర్‌ఎస్‌ ఉద్యమ సమయంలో కల్పన పెళ్ళి చేసిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే కల్పన లాంటి పేద ఆడబిడ్డలకు చేదోడుగా, వాదోడుగా నిలవడానికి కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారు. ఈనెల 24 కల్పన కూతురు చంద్రకళ పెళ్ళి జరుగబోతోంది. మేనమామ కట్నం కి ంద సీఎం కేసీఆర్‌ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షా116 రూపాయలు అందిస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టడానికి స్ఫూర్తిగా నిలిచింది చంద్రకళ తల్లి కల్పన.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన ఏడాది తర్వాత ఉద్యమం బలోపేతంలో భాగంగా నాడు కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటన సాగిస్తున్న సమయం.. 2002 ఏప్రిల్‌ మాసంలో ములుగు జిల్లాలోని మల్లంపల్లి శివారు భాగ్యతండాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండాలోని 64 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితుల్లో కీమానాయక్‌ ఒకరు. ఆ సమయంలో తండాకు వెళ్లిన కేసీఆర్‌ బాధితులను ఓదారుస్తున్న సమయంలో కీమానాయక్‌ దంపతులు గుండెలు అవిసేలా రోదనలు విన్న కేసీఆర్‌ చలించిపోయారు. కూతురు కల్పన పెళ్ళికోసం తెచ్చిపెట్టుకున్న బట్టలు, నగదు, బంగారం, వెండి సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. తన బిడ్డపెళ్లి చేసేది ఎలా అని రోదిస్తుండగా కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారు. కల్పన పెళ్ళి తాను దగ్గరుండి చేయిసున్నానని అభయమిచ్చారు. అనుకున్నట్లే పార్టీ శ్రేణులు పెళ్ళికి ఏర్పాట్లు చేశారు. 50 వేల నగదును కేసీఆర్‌ సమకూర్చారు. కీమానాయక్‌ కూతురు కల్పన, యాకూబ్‌ దంపతుల వివాహనికి హాజరై ఆశీర్వదించారు. పార్టీ ఆధ్వర్యంలో పెళ్ళి ఘనంగా జరిగింది. అనేక పోరాటాలు, ఉద్యమాలు, బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టింది.

ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా కీమానాయక్‌లాగా బాధపడొద్దన్న ఆలోచనలతో కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకాల కు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడేళ్లల్లో 10 లక్షలకు పైగా గిరిబొళ్ల కుటుంబాల ఆడపిల్లల పెళ్ళిళ్ళకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఉద్యమ సమంయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కల్పన యాకూబ్‌ దంపతులు వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం మూడుచక్కలపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కేసీఆర్‌ మేలు మరువకుండా కుమారుడికి చంద్రశేఖర్‌రావు పేరు పెట్టారు. కుమార్తెకు చంద్రకళ పేరుపెట్టారు. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన చంద్రకళకు గురువారం నాడు వర్దన్నపేట మండలం దుబ్బతం డాకు చెందిన బానోత్‌ చందర్‌తో వివాహం జరుగనుంది. మూడుచెక్కలపల్లి గ్రామంలో జరిగే ఈ పెళ్లికి టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులకు కల్పన దంపతులు ఆహ్వానం పంపారు. కేసీఆర్‌ దయతో 20 ఏళ్ళ క్రితం తన పెళ్లి జరిగిందని, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పథకం సహకారంతో తన కూతురు చంద్రకళ పెళ్ళి జరిపిస్తున్నానని కల్పన తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement