Friday, November 22, 2024

మార్కెట్లకు బ్లాక్‌ మండే.. భారీగా పతనమైన సూచీలు.. రూ.10లక్షల కోట్లు సంపద ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఐదో రోజైన సోమవారం భారీగా నష్టపోయాయి. టెక్నాలజీ స్టాక్స్‌ వరుసగా ఆరో రోజూ కుప్పకూలాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ 3శాతం చొప్పున నష్టపోవడంతో.. ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ.10లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒకానొక సమయంలో ఇది రూ.17లక్షల కోట్ల వరకు వెళ్లింది. చివరి ఐదు సెషన్స్‌లో సెన్సెక్స్‌ భారీగా నష్టపోవడంతో.. ఈ కాలంలో దాదాపు రూ.20లక్షల కోట్లపై చిలుకు సంపద క్షీణించింది. బీఎస్‌ఈ 30 స్టాక్స్‌లో 18 స్టాక్స్‌ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ ఏకంగా 6.24 శాతం, టాటా స్టీల్‌ 5.91 శాతం క్షీణించాయి. ఐటీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టెక్‌ మహీంద్రా 5.35 శాతం, విప్రో 5.44 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.87 శాతం, ఇన్ఫోసిస్‌ 2.87 శాతం మేర క్షీణించాయి. హెవీ వెయిట్‌ రిలయన్స్‌ ఏకంగా 4 శాతానికిపైగా నష్టపోవడం గమనార్హం. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 4 శాతం చొప్పున పడిపోయాయి.

931 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌
బీఎస్‌ఈలో ట్రేడ్‌ అవుతున్న 3,700కు పైగా కంపెనీ షేర్లలో 931 షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. మొత్తం పది షేర్లలో ఇది దాదాపు 25 శాతానికి సమానం. ఈ షేర్లు కొనేందుకు బయ్యర్స్‌ లేనిపరిస్థితి దాపురించింది. చిన్న కంపెనీల షేర్ల వ్యాల్యూ ఈ విక్రయాల దెబ్బకు పతనమైంది. లోయర్‌ సర్క్యూట్‌ను తాకిన 875 స్టాక్స్‌లో 694 చిన్న కంపెనీలే కావడం గమనార్హం. సెన్సెక్స్‌ వరుసగా ఐదో రోజు సోమవారంకూడా పతనమైంది. జనవరి 17వ తేదీ నుంచి సెన్సెక్స్‌ దాదాపు 4000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ సుమారు 1200 పాయింట్లు క్షీణించింది. దీంతో అప్పటి నుంచి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.20లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపద ఒక సోమవారమే.. రూ.10లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఐటీ, మెటల్‌, రియాల్టిd స్టాక్స్‌ భారీగా పడిపోయాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2050పాయింట్లు పతనం
సెన్సెక్స్‌ సోమవారం ఉదయం 59,023.97 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 59,023.97 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,984.01 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 2050 పాయింట్ల మేర క్షీణించింది. ఉదయం నుంచి సెన్సెక్స్‌ అంతకంతకూ దిగజారి.. మధ్యాహ్నం 2.15 సమయానికి 2000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఆ తరువాత కొద్దిగా కోలుకుని.. 1,545.67 (2.62 శాతం) పాయింట్లు నష్టపోయి 57,491.51 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,575.15 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 17,599.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,997.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 468.05 (2.66 శాతం) పాయింట్లు నష్టపోయి.. 17,149.10 పాయింట్ల వద్ద ముగిసింది.

68 స్టాక్స్‌ 52 వారాల కనిష్టానికి..
518 స్టాక్స్‌ లాభాల్లో, 3068 స్టాక్స్‌ నష్టాల్లో ముగిశాయి. 120 స్టాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. 252 స్టాక్స్‌ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. అదే సమయంలో 68 స్టాక్స్‌ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. 262 స్టాక్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా.. 931 స్టాక్స్‌లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్స్‌లో అమ్మకాల కారణంగా.. కొత్తగా లిస్టింగ్‌ అయిన పేటీఎం, జొమాటో, నైకా వంటి కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. జొమాటో 20 శాతం, పేటీఎం దాదాపు 5 శాతం వరకు క్షీణించింది. పేటీఎం, కార్‌ ట్రేడ్‌, పీబీ ఫిన్‌ టెక్‌, ఫినో పేమెంట్స్‌ బ్యాంకు స్టాక్స్‌ ఇష్యూ ధరతో పోలిస్తే.. 50శాతం మేర నష్టపోయాయి. గత 9 నెలల కాలంలో సూచీలు అత్యంత చెత్త ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి.

టాటా స్టీల్‌కు భారీ నష్టం
లాభపడిన టాప్‌ 5 స్టాక్స్‌లో బంధన్‌ బ్యాంకు (4.19 శాతం), ఏబీబీ ఇండియా (3.71 శాతం), సిప్లా (2.86 శాతం), లుపిన్‌ (2.01 శాతం), ఇండియా టూరిజం డీ (1.83 శాతం) ఎగిశాయి. ఇక నష్టపోయిన టాప్‌ స్టాక్స్‌లో టాటా స్టీల్‌ (5.98 శాతం), బజాజ్‌ ఫైనాన్స్‌ (5.97 శాతం), విప్రో (5.35 శాతం), టెక్‌ మహీంద్రా (5.14 శాతం), టైటాన్‌ కంపెనీ (4.97 శాతం) ఉన్నాయి.

- Advertisement -

పతనానికి ఇవీ కారణాలు
మార్కెట్‌ వరుసగా పతనం అవ్వడానికి జాతీయ, అంతర్జాతీయ అంశాలు కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్స్‌లో అమ్మకాల ఒత్తిడి, కొత్త షేర్ల పతనం, ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులు, కంపెనీల మార్జిన్ల ఒత్తిడి, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం, భారత్‌ ప్రీ బడ్జెట్‌ దిద్దుబాటు అంశాలు మార్కెట్లపై తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బడ్జెట్‌పై పెరుగుతున్న కరోనా కేసులు ఒత్తిడికి గురి చేస్తున్నాయి. మూడో వేవ్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా బడ్జెట్‌పై అంచనాలతో జనవరి తొలి అర్ధ భాగంలో సూచీలు పైకి పరుగులు పెడుతాయి. బడ్జెట్‌ సమీపిస్తున్నా కొద్దీ.. కేటాయింపులపై వివిధ వర్గాల నుంచి వచ్చే ప్రకటనల ఆధారంగా సూచీలు పయనిస్తాయి. కరోనా నేపథ్యంలో కొత్త బడ్జెట్‌ ఎలా ఉండబోతుందో అన్న టెన్షన్‌ ప్రతీ ఒక్కరిలో నెలకొంది. దీంతో సూచీలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి.

అంతర్జాతీయ పరిణామాలు..
అమెరికాలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. దీని ప్రభావం కూడా భారత్‌ సూచీలపై పడుతున్నాయి. గత వారం ప్రపంచ మార్కెట్లన్నీ క్షీణించాయి. ఫెడ్‌ భేటీ కూడా సూచీలను శాసిస్తున్నది. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడ్‌ ప్రకటించింది. నేటి నుంచి రెండు రోజులపాటు ఫెడ్‌ భేటీ కానుంది. ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్నా.. వడ్డీ రేట్ల పంపు విషయంలో మాత్రం ఫెడ్‌ వెనక్కి తగ్గే ఆలోచనలో లేదనే సంకేతాలు మార్కెట్లను పతాళానికి తోసేస్తున్నాయి. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్‌ సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. అమెరికాలో తయారైన ఆయుధాలను ఉక్రెయిన్‌ సరిహద్దులకు తరలించేందుకు బాల్టిక్‌ దేశాలకు అగ్రరాజ్యం అనుమతి ఇచ్చింది. మరోవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని దౌత్య సిబ్బందిని అమెరికా తగ్గించడం కూడా పతనానికి కారణం.

క్యు3 ఫలితాల ప్రభావం
ఇప్పటికే కొన్ని దేశీయ కంపెనీలు తమ క్యు3 ఫలితాలను ప్రకటించాయి. ఇంకా చాలా కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాల్సి ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన వాటికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు కూడా సూచీలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ముడి చమురు ధరలు కూడాపెరుగుతున్నాయి. సప్లయ్‌ చైన్‌ దెబ్బతింటున్నది. ప్రతీ రోజు 3లక్షల పైచిలుకు కరోనా కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. రెండో వేవ్‌ నుంచి కోలుకుని ముందుకు వెళ్తున్న సూచీలను ఒమిక్రాన్‌ రూపంలో అడ్డుకట్ట వేసింది. కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ఇది మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలను ఇస్తున్నది. ఇటీవలి కాలంలో కొత్తగా లిస్టింగ్‌ అయిన మంచి క్యాపిటల్‌ ఉన్న కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఒక్కో కంపెనీ లిస్టింగ్‌ గెయిన్స్‌ తరువాత.. 50 శాతం పడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement