ట్రైనీ మహిళా ఎస్సైపై అత్యాచార యత్నం చేసిన మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్సై శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపించారు. ఎస్సైపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా రేపింది. ట్రైనింగ్‌లో ఉన్న ఎస్సైని డ్యూటీ పేరుతో అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రాథమిక విచారణలో అతనిపై ఆరోపణలు నిజమేనని తేలడంతో వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి జైలుకి పంపించారు. బుధవారం ఉదయం నిందితుడు శ్రీనివాసరెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. కేసు విచారణ బాధ్యతలను తొర్రూర్ డీఎస్పీకి అప్పగించారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చట్టాలనికి ఎవరూ అతీతులు కారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు