Saturday, November 23, 2024

బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?: మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టు సీరియస్‌

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ లాకప్‌డెత్‌పై హైకోర్టు సీరియస్ అయింది. లాకప్‌డెత్‌కు బాధ్యులైన పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి క్రిమినల్‌ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పౌరహక్కుల సంఘం నేత జయవింధ్యాల దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు మరోసారి విచారించింది. మరియమ్మ మృతి ఘటనపై విచారణ జరిపిన ఆలేరు మేజిస్ట్రేట్‌ విచారణ నివేదికను ధర్మాసనానికి సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సీబీఐ ఎస్పీ ఈనెల 22న హాజరుకావాలని ఆదేశించింది. అలాగే సీబీఐని, కేంద్రాన్ని ప్రతివాదిగా చేరుస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావుకు అప్పగించాలని ఏజీ ప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

కాగా, లాకప్‌డెత్‌ ఘటనకు బాధ్యులైన ఎస్సై, కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు తెలిపారు. మరియమ్మ కుటుంబానికి పరిహారం ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement