మార్చి 30.. భారత క్రికెట్ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. టీమిండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు మార్గం సుగమమైంది ఈరోజే. పదేళ్ల క్రితం ఇదే రోజు (2011, మార్చి 30)న ధోనీ నేతృత్వంలోని భారత్ దాయాదీ పాకిస్థాన్‌ను మట్టి కరిపించి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరీ ముఖ్యంగా పాక్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆధిపత్యం చెలాయించడాన్ని భారత క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. సచిన్ శతకం చేజారినా.. దాయాదులపై సాధించిన ఆ విజయానుభూతిని మాటల్లో వర్ణించలేం.
2011 మార్చి 30న మొహాలీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఇరు దేశాల ప్రధానులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పటి భారత ప్రధాని మన్మోహన్ ఆహ్వానం మేరకు పాక్ ప్రధానిగా ఉన్న యూసుఫ్ రజా గిలానీ ప్రత్యేకంగా మొహాలీకి వచ్చి మరీ మ్యాచ్‌ను తిలకించారు. అలాగే పాక్ నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాలావరకు టికెట్లు బ్లాక్‌లో అమ్ముడుపోయాయి. కీలకమైన పోరును ప్రత్యక్షంగా చూసేందుకు నిర్ణీత ధరకన్నా మూడింతలు ఎక్కువే పెట్టి అభిమానులు కొనుగోలు చేశారు. దాంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. ఓపెనర్లు సెహ్వాగ్ (38), సచిన్ (85), ధోనీ (25), రైనా (36 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత ఓవర్లలో 260 పరుగులు చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న పాకిస్థాన్‌కు ఈ టార్గెట్ ఏమాత్రం సరిపోదనిపించింది. కానీ భారత బౌలర్లు చెలరేగడంతో వరుసగా వికెట్లు కోల్పోయిన పాక్ 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.