రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు ఉక్రెయిన్ లోని క్యివ్ ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. యుద్దం నేపథ్యంలో విదేశీయులంతా దేశాన్ని విడిచి వెళ్లాలయిని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వీరంతా భారత్ కు వచ్చేందుకు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారు. ఈరోజు క్యివ్ ఎయిర్ పోర్టుకు వెళ్లడంతో అక్కడి ప్రభుత్వం ఎయిర్ పోర్టును మూసివేసింది. అదే సమయంలో బయటకు వెళ్లే దారులన్నీ మూసివేసింది. దీంతో అటు స్వదేశం రాలేక, ఇటు యూనివర్శిటీకి వెళ్లలేక దాదాపు 20 మంది ఎయిర్ పోర్టు వద్దే చిక్కుకుపోయారు. వీరిలో కరీంనగర్ కు చెందిన మెడికల్ విద్యార్థి కడారి సుమాంజలితోపాటు తెలంగాణకు చెందిన రమ్యశ్రీ, ఎన్.శ్రీనిధి, లిఖిత ఉన్నారు.
వీరంతా ఉక్రెయిన్ లోని జాఫ్రోజియా మెడికల్ యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే. వీరితోపాటు దాదాపు 20 మంది ఎయిర్ పోర్ట్ వద్ద చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని కడారి సుమాంజలి తన సోదరుడు కడారి స్వామికి ఫోన్ చేసి తాము ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయాన్ని వివరించారు. తమను ఎటూ వెళ్లనీయడం లేదు. అవస్థలు ఎదుర్కొంటున్నామని వాపోయారు. దీంతో కడారి స్వామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిసి తమ సోదరితోపాటు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయి భారతీయులు పడుతున్న బాధలను వివరిస్తూ… వెంటనే తమ వారిని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. తక్షణమే స్పందించిన బండి సంజయ్ కుమార్ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కార్యాలయానికి ఫోన్ చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కుపోయిన వారందరినీ స్వదేశానికి రప్పించాలని కోరుతూ లేఖ పంపారు. బండి సంజయ్ లేఖ తో విదేశాంగ శాఖ మంత్రి కార్యాలయ అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.