తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని కారణంగా రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలకు వచ్చే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో తెలంగాణలో 2021, జూన్ 03వ తేదీ గురువారం నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు.
ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్‌సూన్. భారత వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడనున్నాయి. అటు నుంచి జూన్ 12వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తాయి. వాస్తవానికి జూన్ 1నే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయనుకున్నా..రెండు రోజులు ఆలస్యంగా వస్తాయని ఐఎండీ వెల్లడించింది. కర్నాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఆలస్యమయ్యాయని చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత.. 4 నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.