న్యూఢిల్లీ: హాకీలో భారత పురుషుల జట్టు ఈ ఏడాదిని మూడో ర్యాంక్‌తో ముగించింది. మరోవైపు భారత మహిళల హాకీజట్టు 9వ స్థానంలో నిలిచింది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకున్న భారత హాకీ జట్టు మూడో ర్యాంక్‌లో నిలిచింది. మన్‌ప్రీత్‌సింగ్ సారథ్యంలోని భారతజట్టు ఈ ఏడాది ఆరంభంలో టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం గెలిచి 41ఏళ్ల పతక నిరీక్షణకు ముగింపు పలికింది. ఢాకాలో ముగిసిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడోస్థానంలో నిలిచి పాక్‌పై గెలిచి కాంస్యాన్ని గెలుచుకుంది. ఒలింపిక్ ఛాంపియన్ బెల్జియం రెండోస్థానంలో నిలవగా ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది.
బెల్జియం కంటే ఆస్ట్రేలియా కేవలం 10పాయింట్లు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా 2642.25 పాయింట్లు, బెల్జియం 2632.12పాయింట్లు, భారత్ 2,296.38పాయింట్లుతో వరుస మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్ 2,234.33, జర్మనీ 2038.71టాప్-5లో చోటు సంపాదించగా ఇంగ్లండ్ 1990.62పాయింట్లుతో ఆరోస్థానంలో నిలిచింది. అర్జెంటీనా 1826.11, న్యూజిలాండ్ 1598.24, స్పెయిన్ 1532.33, మలేషియా 1427.18పాయింట్లతో వరుసగా టాప్-10 ర్యాంకింగ్స్‌లో నిలిచాయి. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయాజట్ల మధ్య ర్యాంకింగ్స్‌లో మార్పు జరిగింది. ఆసియా ఛాంపియన్ దక్షిణ కొరియా 16వ స్థానంలో నిలిచింది. రన్నరప్ జపాన్ 17వ స్థానంలో కొనసాగుతుంది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగోస్థానంలో నిలిచిన పాకిస్థాన్ 18వ స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్ రెండుస్థానాలు దిగజారి 40వ స్థానంలో కొనసాగుతుంది. కాగా భారత మహిళల హాకీజట్టు ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక నాలుగోస్థానంలో నిలిచింది. ఈ ఏడాదిని రాణిసేన 1810.32పాయింట్లుతో ఎఫ్‌ఐహెచ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో నిలవగా నెదర్లాండ్స్ మహిళాజట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది.