కరీంనగర్ నగరాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా నిలిపే విధంగా మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రూపు దాల్చనుందనీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసిఆర్ ప్రత్యేక చొరవతో ఫస్ట్ ఫేజ్ లోని 4 కిలోమీటర్ల మేర 410 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని,ఇప్పటికే సర్వే పనులు ముగించుకొని పౌండేషన్ పనులు సాగుతున్నాయన్నారు. మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో డిజైన్ కన్సల్టెన్సీ, ఎజెన్సీ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్షించారు. ముఖ్యంగా లైటింగ్, పౌంటెన్ల ఏర్పాట్లు, డిజైన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అత్యంత వేగంగా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వం క్రుత నిశ్ఛయంతో ఉందన్నారు. కరీంనగర్ నగర వాసులకు అహ్లాదకరమైన ప్రాంతంగా మానేర్ రివర్ ఫ్రంట్ రూపుదాల్చనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధి వంశీ, రైనో సంస్థకు చెందిన నాయుడు, అనిల్, కునాల్లు పాల్గొన్నారు.