Thursday, November 21, 2024

Exclusive | నగ్నంగా నడిచింది  దేహం కాదు.. అది దేశం!

మణిపూర్​లో జరిగిన దారుణ ఘటనపై యావత్​ దేశం సిగ్గుపడుతోంది. మహిళలను నగ్నంగా ఊరేగించడంపై లోలోన కుమిలిపోతోంది. ఇంతటి దారుణం వెనకాల ఉన్నదెవరన్న విషయాలపై ఆరా తీస్తోంది. రాజకీయమా, మత మౌఢ్యమా? అన్న విషయాలను తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ యువతీ యువకులు లేరని భావిస్తున్నారేమో. కానీ, ఇదంతా అవగతమైన రోజు వారి కుటిల నీతి, కుతంత్రాలన్నీ మట్టిలో కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు మేధావులు, కవులు, రచయితలు..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మణిపూర్​ మారణకాండను, మహిళలపై దారుణ​ ఘటనలను ఆవేదనాభరితంగా.. సిగ్గుతో తలదించుకునే స్థితిగతులపై ఓ కవి తన అక్షరాలను ఎక్కుపెట్టారు..

నగ్నంగా నడిచింది  దేహం కాదు.. అది దేశం

యుగాలు దాటొచ్చిన మనిషిని

- Advertisement -

మృగాలుగా మార్చింది ఎవ్వడు ?

పాలిచ్చిన అమ్మల రొమ్ములను

బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి

ఊతమిచ్చింది ఎవ్వడు ?

వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ?

విధ్వేషాన్ని రక్తనాళాలలోకి

ఎక్కించింది ఎవ్వడు?

తల్లుల జననాంగాల మీద తాండవ మాడిన

గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ?

నెత్తురుని మరిగించింది ఎవ్వడు ?

కత్తులను నూరించింది ఎవ్వడు ?

పరమత ఆలయాలను కూల్చింది ఎవ్వడు?

ఉసురు తీసి ఉత్సవం చేసింది ఎవ్వడు ?

మంటలను రాజేసింది ఎవ్వడు ?

గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు ?

మదమెక్కి ఆడబిడ్డలపై మానభంగం చేసిన

మతోన్మాద మూకలకు నూకలు

ఇస్తున్నది ఎవ్వడు?

పాకలు వేసి “భక్షణ శిక్షణ”

అందిస్తున్నది ఎవ్వడు ?

ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది ?

ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది ?

మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది ?

పచ్చని గసగసాల పైరు కొండల

మణిపూర్ కన్నుల కుండల నిండా 

మరిగే వెచ్చిని నీరును నింపుతున్నది ?

వాడు….! వాడెవడంటే….!!

ఛాందస పీఠంపై పీటలు వేసుకొని

మౌడ్య సిరా చుక్కలను

మౌన కలంలోకి ఒంపుకొని

రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.

మన జీవన గమనాలను శాసిస్తున్నాడు.

అయితే….. !

ఇప్పుడు వాడు అనుకుంటున్నట్టు …!!

మణిపూర్ నడి వీధుల్లో

నగ్నంగా నడిచింది దేహం కాదు

 ………‌ “అది దేశం”.

పాశవిక అత్యాచారం జరిగింది

మానం మీద కాదు

……. “వాడి మౌనం మీద”

….**…….*….**…

( వాడి మౌనం ఎంత ప్రమాదమో…..మన మౌనం అంతకంటే ప్రమాదం మిత్రులారా )

…..మణిపూర్ మారణకాండను , భరతమాతలపై జరిగిన పైశాచిక అత్యాచార దాడులను తీవ్రంగా ఖండిద్దాం. ఉన్మాద రాజకీయాలను , వాటి సైద్ధాంతిక భావజాలాన్ని తిప్పికొడదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement