Saturday, November 23, 2024

Spl Story: కొత్తరకం మామిడి పండ్లు.. మార్కెట్లోకి ‘సుస్మితా’, అమిత్​షా రకాలు!

మామిడి సాగులో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. హైబ్రీడ్​ రకాలతో తన పేరునే ‘మ్యాంగోమ్యాన్’​గా మార్చుకున్నాడు ఈ పెద్దాయన. ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రం లక్నో దగ్గర్లోని మలిహాబాద్​ విలేజ్​లో ఇప్పటికి 300 పైగా తన తోటలో వెరైటీలున్నాయి. చిన్నప్పుడు బడికి వెళ్లమంటే బంక్​ కొట్టి బలాదూర్​గా తిరిగేవాడు.. ఆ తర్వాత చదువుపై ఆసక్తిలేక మామిడి పండ్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. కొంతకాలనికి తన అభిరుచికి తగ్గట్టు కొత్త కొత్త మామిడి రకాలకు ప్రాణం పోస్తూ హార్టీకల్చర్​ రంగంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈపెద్దాయన పనితీరును మెచ్చిన కేంద్రం 2008లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. అయితే.. ఇప్పుడు కొత్తగా తన తోటలో ‘సుస్మితా ఆమ్’​, ‘అమిత్​షా ఆమ్’​ అనే రెండు కొత్త జాతి వంగడాలను సృష్టించాడు. ఆ పండ్లు సుస్మితా అంత అందంగా, స్వీట్​గా కూడా ఉంటాయని చెబుతున్నాడు. మరి ఈ మ్యాంగోమ్యాన్​ ముచ్చట్లేందో చదివి తెలుసుకుందాం.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ప్రసిద్ధ మామిడి సాగుదారు హాజీ కలీముల్లా ఖాన్ విభిన్నమైన సంకరజాతులను (హైబ్రీడ్​) పెంచుతున్నారు. దశాబ్దాలుగా వాటికి ప్రముఖుల పేర్లను పెడుతూ ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు. 82 ఏళ్ల ఈ ఓల్డ్​ మ్యాన్​ ఇంతకుముందు ములాయం ఆమ్, నమో ఆమ్, సచిన్ ఆమ్, కలాం ఆమ్, అమితాబ్ ఆమ్.. యోగి ఆమ్ వంటి 300కు పైగా ప్రత్యేకమైన మామిడి పండ్లను పండించారు. 2008లో ఖాన్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. అతను ఉద్యానవన రంగానికి చేసిన కృషికి, అలాగే మామిడి రకాలను సంరక్షించడం, విస్తరించడంలో చేసిన ప్రయత్నానికి ఈ పురస్కారం దక్కింది.

ఇక..  ప్రపంచానికి ‘ఐశ్వర్య’ , ‘సచిన్’ వంటి ప్రత్యేకమైన మామిడి పండ్లను అందించిన ఈ ఉద్యానవన శాస్త్రవేత్త హాజీ కలీముల్లా ఖాన్ పండ్లలో రారాజు అయినా మామిడిలో మరో రెండు రుచికరమైన కొత్త సంకర (హైబ్రీడ్​) జాతులను అభివృద్ధి చేశారు.  వాటికి ప్రముఖుల పేర్లను పెట్టారు. ఈసారి రెండు కొత్త రకాలకు ‘సుస్మితా ఆమ్’, ‘అమిత్ షా ఆమ్’ అని నామకరణం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో ఉన్న అతని తోటలో ఈ రెండూ అభివృద్ధి చేసి, సాగు చేస్తున్నట్టు తెలిపారు. 

అందంగా, వంకరగా ఉండే పండు పేరుకు ‘సుస్మితా ఆమ్’ అని.. ఇది మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కోసం పెట్టినట్టు హాజీకలీముల్లా చెప్పారు. సుస్మితా సేన్ తన అందం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ఇద్దరు దత్తపుత్రికలతో అందరి మనసులను చూరగొన్నారని, తన అందంతోపాటు.. తన మనసును తెలియజేశారని.. అందుకే ఈ కొత్తరకం మామిడిపండుకు సుస్మితా ఆమ్​ అని పేరుపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. 

- Advertisement -

కాగా, అందాల నటి ఐశ్వర్య పేరుతో ఓ మామిడి పండును తీసుకొచ్చానని.. దానికి ఫుల్​ క్రేజీ వచ్చిందన్నారు ఖాన్​.  తాను మొదట’ఐశ్వర్య ఆమ్’ అని పేరు పెట్టానని, కానీ, సుస్మితా సేన్ గురించి తనకు చాలా కాలం తర్వాత ఎవరో చెప్పారన్నారు. దాంతో ఆమె అందం ఎప్పుడూ ఈ ప్రపంచంలో ఉండాలని, ఎవరూ మరిచిపోలేని రీతిలో తనకు ఓ మామిడి పండు రకాన్ని బహుమానంగా ఇవ్వాలనుకున్నట్టు చెప్పారు.  అయితే.. తన అందంతోపాటు ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలన్నదే తన ఆశగా తెలిపారు. అందుకే ఈ మామిడి వెరైటీని డెవలప్ చేసి ఆమె పేరు మీద ‘సుస్మిత’ అని పేరు పెట్టినట్టు వివరించారు.

ఇక.. మరో కొత్త రకం మామిడి జాతికి ‘అమిత్ షా ఆమ్’ పేరు పెట్టానని, దీనికి బీజేపీలో ఆయన స్థాయి, కేంద్రంలో హోం మంత్రిగా ఉండడమే కారణమని తెలిపారు. ఈ పండు కూడా రుచికరంగా ఉంటుందని, అంతేకాకుండా చాలా వెయిట్​ ఉంటుందని వెల్లడించారు. అమిత్​షా పేరుకు తగ్గట్టే  బలమైన వ్యక్తిత్వానికి సరిపోలడానికి దాని పరిమాణం, రుచిపై మరింతగా కృషి చేశానన్నారు. దీనికోసం చాలా కష్టపడ్డానని, త్వరలో ఈ మామిడిపండు అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఖాన్​.  

Advertisement

తాజా వార్తలు

Advertisement