సినిమా టికెట్ల రేట్ల విషయంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరల వివాదంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేననని అన్నారు. వైఎస్ హయంలో వచ్చిన జీవోలపై చర్చ జరగాలన్న విష్ణు.. సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పనిలేదన్నారు. ఎవరూ తన అభిప్రాయం అడగడం లేదన్నారు.
కాగా, జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన లంచ్ మీటింగ్ తో సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యలు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి కలుస్తున్నానని సీఎం జగన్ తో చిరంజీవి తెలిపారు.
సీఎం జగన్ తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగిందని చిరంజీవి అన్నారు. పండుగనాడు ఓ సోదరుడిలా ఆహ్వానించి విందు ఇచ్చారన్నారు. కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మద్య తర్జనభర్జనలు నెలకొన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి విధివిధానాలు ఖరారు చేసి తుదినిర్ణయం తీసుకుంటామని జగన్ అన్నారని చిరు తెలిపారు. సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలన్న సీఎం ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ ఎదుర్కొనే పరిస్థితులను జగన్ కు వివరించినట్లు వెల్లడించారు.