యూపీ బల్లియా జిల్లాలోని కరణ్ చాప్రా గ్రామానికి చెందిన పెళ్లి కాని 45 ఏళ్ల ఓ వ్యక్తి సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పోటీ చేసి తన కల నెరవేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. వివరాల్లోకి వెళ్తే హతి సింగ్ (45) అనే వ్యక్తి తన గ్రామంలో 2015 సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానం సంపాదించాడు. అయితే ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో గెలిచి సర్పంచ్ కావాలనుకున్నాడు. కానీ తీరా కట్ చేస్తే ఆ సీటు మహిళకు రిజర్వ్ కావడంతో నిరాశలో కుంగిపోయాడు. దీంతో ఆయన మద్దతుదారులు పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. వివాహం చేసుకుంటే భార్యను ఎన్నికల్లో బరిలోకి దింపవచ్చని సూచించారు.. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం సరైన ముహుర్తాలు లేకపోయినా.. ఆయన పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. నామినేషన్ దాఖలుకు ఏప్రిల్ 13 చివరి రోజు. అందుకే ముందుగా పెళ్లి చేసుకున్నట్లు హతి సింగ్ తెలిపాడు.
గ్రామం కోసం తాను గత ఐదేళ్లుగా చాలా కష్టపడ్డానని, అయితే సర్పంచ్ సీటు మహిళకు రిజర్వ్ చేశారని, తన తల్లికి 80 ఏళ్లు అని, ఆమె పోటీ చేయలేరని తెలిపాడు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోకూడదనుకున్న తన నిర్ణయాన్ని మద్దతుదారుల సలహాతో మార్చుకున్నట్లు హరి సింగ్ చెప్పాడు. మరోవైపు డిగ్రీ చదువుతున్న వధువు పెళ్లి అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది.