కర్నాటక రాష్ట్రంలో జరిగిన వేర్వేరు రెండు ఘటనల్లో నిన్న, ఇవ్వాల రెండు తీర్పులు వెలువడ్డాయి. ఒక తీర్పులో దోషికి కోర్టు 20 ఏళ్ల కఠిన కాగారా శిక్ష వేయగా.. మరో కేసులో నిందితుడికి 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ రెండు కూడా మైనర్ అమ్మాయిలపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవే కావడం గమనార్హం.
17 ఏళ్ల బాలికతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికకు పెళ్లి చేస్తానని హామీ ఇచ్చి బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆమె పేరెంట్స్ కంప్లెయింట్ చేశారు. ఇటీవలే శిక్షను ప్రకటించిన IIIవ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి ఇష్రత్ జెహాన్.. ఈ అత్యాచారం కేసులో నిందితుడికి 10సంవత్సరాల జైలు శిక్ష తో పాటు 5వేల జరిమానా విధించారు.
అంతేకాకుండా.. కిడ్నాప్ ఆరోపణలపై అతనికి మరో ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 50వేల జరిమానా కూడా విధించారు. ఈ అన్ని శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతోపాటు బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం అందించాలని కర్నాటక లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది. దోషికి విధించిన జరిమానా నుంచి 10వేల మొత్తాన్ని బాధితురాలికి కూడా చెల్లిస్తారు.
కాగా, ఈ కేసులో ప్రీతం బాబు అకా చిట్టి బాబుగా పోలీసులు తెలిపారు. తన ఇంటి సమీపంలో ఉండే అమ్మాయికి తన వైవాహిక స్థితిని దాచిపెట్టి, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, ఆ మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు వెల్లడించారు. అతను తరచూ ఆమెను తనతో తిప్పుకుంటూ బలవంతంగా శృంగారానికి పాల్పడేవాడని, 2017 డిసెంబర్ 23న ఆమెను స్నేహితురాలి ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలిపారు..
ఇక.. ఉడిపిలో కూడా ఇదే విధమైన తీర్పులో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు 2021లో ఓ బాలికపై చేసిన దారుణ ఘటనకు కఠినమైన శిక్ష విధించింది. బాలికను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినందుకు 55 ఏళ్ల వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పోక్సో కోర్టు నిన్న ఈ తీర్పు వెలువరించింది. -హవేరీ నివాసి అయిన హనుమంత అనే నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ సువర్ణ ఈ కఠిన శిక్ష విధించారు.
బాధితురాలు తన తల్లితో కలిసి ఉండే ఫామ్‌హౌస్‌లో హనుమంత ఉద్యోగం చేస్తున్నాడు. 2021 జనవరిలో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి తెలియజేయగా.. ఆమె కుందాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కోర్టు అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 25వేల జరిమానా విధించింది. ఈ ఫైన్ కట్టలేని పక్షంలో అతను మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.