ప్రతి గ్రామంలో మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైకుంఠ దామాలు నిర్మించింది. కానీ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో మాత్రం మనిషి చనిపోతే కాల్చేందుకు స్థలం లేదు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలోని పెద్దగుట్ట తండాలో బద్రు నాయక్ అనే గిరిజన వృద్ధుడు నిన్న రాత్రి మృతి చెందాడు. బద్రు నాయక్ అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. అయితే తండాలో చనిపోయిన వ్యక్తికి కనీసం కాష్టం చేయడానికి కూడా గజం జాగా లేకపోవడంతో విస్మయానికి గురి చేస్తోంది.
గతంలో స్థానికంగా ఉన్న మూడు తండాలకు సంబంధించి అధికారులు ఓ దగ్గర 5 గుంటల భూమిని కేటాయించారు. బద్రు నాయక్ శవాన్ని అక్కడకు తీసుకెళ్లగా.. స్థానిక తండా వాసులు అడ్డుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు ట్రాక్టర్ లో కట్టెలతో మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అలా మూడు స్థలాలు తిరిగినా అంత్యక్రియలకు ఒప్పుకోని పరిస్థితి ఎదురైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేసేందుకు జాగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: దళిత బంధుకు దండోరాతో చెక్!