ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. ఆరోగ్యం కోసం చల్లనివి తాగకూడదని, తినకూడదంటూ వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఐస్ క్రీం తిన్న ఓ యువకుడు మృతి చెందాడు. నాచారంకు చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం తెల్లవారుజామున తన అభిమాన స్ట్రాబెర్రీ రుచిగల ఐస్ క్రీంను అతిగా తినడం వల్ల మరణించినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారంకు చెందిన సాయి సంపత్ అనే యువకుడు గురువారం రాత్రి స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ప్యాక్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేశాడు. రాత్రి ఐస్ క్రీమ్ ను తిన్నాడు. అయితే, అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అనంతరం అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. ఇది గమనించిన సంపత్ తండ్రి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సంపత్ మృతి చెందినట్లు పారామెడికల్ సిబ్బంది ప్రకటించారు. కాగా, సంపత్ తండ్రి మల్లెష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాచకొండకు చెందిన నాచరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.