– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని శీత్లా మాత ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన 27 ఏళ్ల కుర్రాడు శనివారం బ్లేడుతో గొంతు కోసుకుని చనిపోయాడు. ఇంకా అతని ఒంటిపై చాలా రక్తపు గాయాలున్నాయి. మృతుడు మనోజ్ కుమార్ తన తల్లితో కలిసి మిర్జాపూర్ హాలియా ప్రాంతంలోని ప్రసిద్ధ ఘట్గా ధామ్ శీత్లా మాత ఆలయానికి వచ్చాడు. అతని తల్లి కేశరీదేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మనోజ్ ఆలయ ద్వారం వద్ద కూర్చుని తన జేబులో నుండి బ్లేడును తీసి శరీరమంతా గాయాలు చేసుకున్నాడు. దీంతో అతని బాడీ మొత్తం విపరీతమైన రక్తం కారసాగింది. కొంత సమయం తర్వాత స్పృహ కోల్పోయాడు.
ఈ విషయం తెలిసి ప్రదక్షిణలు చేస్తున్న అతని తల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. సహాయం కోసం కేకలు వేయడంతో అక్కడ ఉన్నవారు వచ్చి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మిర్జాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఆలయంలో అమర్చిన సీసీటీవీ కెమెరాను పోలీసులు పరిశీలించగా.. మనోజ్ కుమార్ ఆలయ ద్వారం ముందు కూర్చుని బ్లేడ్‌తో తనకు తానే గాయాలు చేసుకున్నట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్గంజ్లోని ఇందిరా గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనోజ్ బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక స్థితి సరిగా లేదు. అందుకనే ఘట్గా ధామ్‌లో ఉన్న అమ్మవారిని సందర్శించేందుకు తీసుకువచ్చినట్టు తల్లి కేశరీదేవి చెప్పిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ మహేష్ అత్రి తెలిపారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డైంది. తదుపరి విచారణ జరుగుతోంది.