Thursday, November 21, 2024

ప్రాంతీయ పార్టీల‌తో కూట‌మికి దీదీ ప్లాన్..

కోల్‌కతా: వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు విపక్ష కూటమి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్‌ సహా ప్రధాన పార్టీలన్నీ సుముఖతను వ్యక్తంచేస్తున్నాయి. అయితే, కూటమికి ఎవరు నాయకత్వం వహించాలన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఓవైపు కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు, ఇంకొక వైపు ప్రాంతీయ కూటమికి నాయకత్వం వహించాలని తపిస్తున్న పార్టీలు ఎవరికివారు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీని గద్దె దించాలన్నదే వీరి ఉమ్మడి ఆశయం. కానీ ఆశయ సాధన వెనుక ఆశ, ఆకాంక్షల కారణంగా భిన్న దారులను వెతుకున్నారు.
జాతీయంగా బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటికి సమాన దూరాన్ని కొనసాగించడం మా వ్యూహం. బీజేపీతో పోరాడాలనుకునే ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌గా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇప్పటికే వారితో చర్చలు జరుపుతున్నాము. ఈ వ్యూహం తదుపరి పార్లమెంట్‌ సమావేశాలలో ప్రతిబింబిస్తుంది అని లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ చెప్పారు.


ఈశాన్య ప్రాంతంలో విస్తరణకు ప్రయత్నించి భంగపడిన తృణమూల్‌ కాంగ్రెస్‌, తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు సమానదూరాన్ని పాటిస్తూ, ఈ రెండు శిబిరాలకు సారూప్యంగా కొత్తగా ప్రాంతీయ కూటమి సమూహాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లి ఎన్నికల్లో, త్రిపురలో నోటా కంటే టీఎంసీకి తక్కువ ఓట్లు వచ్చాయి. మేఘాలయలో ఆ పార్టీ బలం 11నుంచి ఐదుకి పడిపోయింది. మొన్నటి దాకా దీదీకి కొమ్ముకాసిన మైనారిటీలు ఇప్పుడు క్రమంగా ఆమెకు దూరమవుతున్నారు. దీంతో బెంగాల్‌లోని సాగర్దిఘి నియోజకవర్గ ఉప ఎన్నికలో దీదీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బెనర్జీ ఇటీవలే ప్రకటించారు. విపక్షాల ఓట్లను విభజించడం ద్వారా బీజేపీకి తృణమూల్‌ కాంగ్రెస్‌ సహాయం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో పాటు సిపిఎం నాయకులు ఆరోపించిన నేపథ్యంలో ఆమె ఈ విధమైన ప్రకటన చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున రానున్న రోజుల్లో పరిస్థితి మరింతగా మారుతుందని టిఎంసి సీనియర్‌ నేత, ఎంపీ సౌగత్‌ రాయ్‌ అన్నారు. ఈ ఏడాది నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగుతాయి. పరిస్థితులు ఎలా రూపుదిద్దుకుంటాయో చూద్దాం. ఈ ఏడాది చివరి నాటికి రాజకీయ పరిస్థితులు మరింతగా మారతాయి అని రాయ్‌ చెప్పారు. భారత రాజకీయాల్లో వాస్తవిక మార్పులను కాంగ్రెస్‌ అంగీకరించడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో గత తొమ్మిదేళ్లుగా ఆపార్టీ ఘోరంగా విఫలమైంది అని టిఎంసి ముఖ్య అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్‌ రాయ్‌ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో బలమైన శక్తులతో జతకట్టేందుకు ప్రయత్నిసామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement