కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధిస్తారని తెలిపారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పోటీలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ ఇద్దరే ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 8వ తేదీ వరకు సమయం ఉంది. ఈలోగా ఎవరూ ఉపసంహరించుకోకుంటే.. 17వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మల్లికార్జున ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని.. ఆయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలరన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడేందుకు ప్రయత్నించి, పలు పరిణామాల నేపథ్యంలో వెనక్కి తగ్గిన గెహ్లాట్.. ఈ ఎన్నికకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే దళిత వర్గం నుంచి వచ్చిన నేత అని.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ చెప్పారు. అయితే శశిథరూర్ మంచి వ్యక్తి అని, ఆయనకు మంచి ఆలోచనలు ఉన్నాయని.. కానీ ఆయన ఉన్నత వర్గానికి చెందినవారన్నారు. అందువల్ల క్షేత్రస్థాయిలో మల్లికార్జున ఖర్గేకు మద్దతు ఉందని.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం కూడా ఆయనకు ఉందని వ్యాఖ్యానించారు. సహజంగానే పోటీ ఖర్గే వైపు ఏకపక్షంగా సాగుతుందని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement