Thursday, November 14, 2024

మ‌ళ్ళీ పెళ్ళి.. న‌రేష్ కి హిట్ట్ ఇచ్చిందా..!

ఎం.ఎస్.రాజు డైరెక్ష‌న్ లో సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ స్వ‌యంగా నిర్మించిన చిత్రం మ‌ళ్ళీ పెళ్ళి. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. నరేంద్ర(నరేష్‌).. పెద్ద యాక్టర్‌, 350కిపైగా సినిమాలు చేశాడు. ఇప్పటికీ బిజీగా ఉంటాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఇంట్లో ఒక ఆడ తోడు ఉంటే బాగుండని వెయిట్‌ చేస్తున్న రోజులవి. ఆ సమయంలో పార్వతి(పవిత్ర లోకేష్‌)ని ఓ సినిమా షూటింగ్‌లో చూస్తాడు నరేంద్ర. తొలి చూపులోనే ఏదో ఎట్రాక్షన్‌ తనని వెంటాడుతుంది. ఇలా వరుసగా షూటింగ్‌లో కలుస్తారు, పరిచయం పెరుగుతుంది. స్నేహం బలపడుతుంది. నరేష్‌ మనసులో ప్రేమ పుడుతుంది. దీంతో ఆమెలాంటి భార్య తనకు లైఫ్‌లో ఉంటుందని భావిస్తుంటాడు. మరోవైపు మూడో భార్యతో సౌమ్య సేతుపతి(వనితా విజయ్‌ కుమార్‌) గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆమె డబ్బుల కోసం వేదిస్తూనే ఉంటుంది. మరోవైపు పార్వతి తన భర్త ఫణీంద్ర(రవివర్మ)తో సరైన ప్రేమని పొందలేకపోతుంది. వీరి మధ్య గొడవలు అవుతుంటాయి. మరి పార్వతి, ఫణీంద్రల మధ్య గొడవేంటి? నరేంద్ర, సౌమ్యల మధ్య గొడవలకు కారణమేంటి? నరేంద్ర, పార్వతి ఎలా దగ్గరయ్యారు? వీరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నానేది మిగిలిన సినిమా.

విశ్లేషణ.. ఈ సినిమా నరేష్‌ లైఫ్‌ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నరేష్‌, తన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రలోకేష్‌ లైఫ్‌లను, ఈ ముగ్గురి మధ్య జరిగిన సన్నివేశాల ఆధారంగానే, యదార్థంగా రూపొందించినట్టు తెలుస్తుంది. ఓ రకంగా ఇది నరేష్‌ ఆటో బయోగ్రఫీ మూవీ అని చెప్పొచ్చు. తన మూడో భార్య తన జీవితంలోకి ఎలా వచ్చింది, ఆమెతో గొడవలేంటి? ఈ క్రమంలో పవిత్ర లోకేష్‌కి ఎలా ఆకర్షితుడయ్యాడు. ఆమె పెళ్లి జీవితంలోని సమస్యలేంటి? అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే సినిమా పరంగా ఇది నరేష్‌ కోణంలో సాగే మూవీలా అనిపిస్తుంది. అంటే గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నరేష్‌ తన వెర్షన్‌లో జనానికి క్లారిటీ ఇచ్చేందుకు ఈ సినిమా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బహుశా అందుకే ఆయన ఈ సినిమా నిర్మించి ఉంటారు. నరేష్‌ ఈ సినిమాలో తన మూడో భార్యని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు, తనని ఓ సైకోలా, శాడిస్ట్ గా, డబ్బుల కోసం వేధించే వ్యక్తిగా, బ్లాక్‌ మెయిలర్‌లా చూపించారు. తాను మాత్రం ఇంటి తోడు కోసం, మంచి భార్య కోసం, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తిగా చూపించుకున్నాడు. ఈ క్రమంలో పవిత్ర లోకేష్‌తో ప్రేమకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. మరోవైపు పవిత్ర లోకేష్‌ స్టోరీలో అతని భర్తని విలన్‌గా చూపించారు. అగ్ర కులం వ్యక్తిగా, పవిత్రని తక్కువగా చూసేవాడిగా, తనని కేవలం తన స్టేటస్‌ కోసం ఆమెని వాడుకున్నట్టుగానే చూపించారు. వాస్తవం ఏంటనేది మాత్రం వాళ్లకే తెలియాలి. కానీ చూసే ఆడియెన్స్ కి మాత్రం ఇటు నరేష్‌, పవిత్రల కోణంలో సాగే సినిమాగే ఎజెండా మూవీలాగే అనిపిస్తుంది.

- Advertisement -

నటీనటుల న‌ట‌న‌..నరేష్‌.. నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరగదీస్తాడు. ఇక తన సొంత కథ కావడంతో మరింతగా రెచ్చిపోయాడు. వన్‌ మ్యాన్‌ షో చేశారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. పవిత్ర లోకేష్‌ సెటిల్డ్ గా చేసింది. ఆకట్టుకుంటుంది. నరేష్‌ మూడో భార్యగా వనితా విజయ్‌ కుమార్‌ ఇరగదీసింది. ఆమె సన్నివేశాలు మరింతగా ఆకట్టుకుంటాయి. కృష్ణగా శరత్‌బాబు, విజయ నిర్మలగా జయసుధ ఓకే అనిపించారు. అనన్య నాగళ్ల రొమాంటిక్‌ సీన్లలో ఇరగదీసింది. ఆమె పాత్ర మరో హైలైట్‌. రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ, భద్రం, మిగిలిన పాత్రలు పర్వాలేదనిపించాయి. సురేష్‌ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అరుల్‌ దేవ్‌ బీజీఎం ఫర్వాలేదు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. కనెక్టివిటీ చూసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. నరేష్‌ సొంత సినిమా కావడంతో బాగానే ఖర్చు పెట్టాడు. దర్శకుడు ఎంఎస్‌ రాజు సినిమాని కామెడీ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. ఈ సినిమాకి ఎమోషన్స్ ముఖ్యం. కానీ వాటికి ప్రయారిటీ ఇవ్వలేదు. లవ్‌ ట్రాక్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అయితే ఆయన నరేష్‌ సలహాలకు, ఆయన డామినేషన్‌కి లోబడే సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో సన్నివేశాల మధ్య కనెక్టివిటీ మిస్‌ అయ్యింది. సినిమాకి ఉండాల్సిన ఫీల్‌ మిస్‌ అయ్యిందనిపిస్తుంది.ఓవ‌రాల్ గా సినిమా విజ‌యం అనేది ప్రేక్ష‌కులు చూసే తీరుపై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement