Friday, November 22, 2024

కేసీఆర్ ను కలిసేందుకు మల్లారెడ్డి తంటాలు

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మల్లారెడ్డి బెదిరించిన ఆడియో లీక్ కావడం ఇపుుడు రాజకీయంగా సంచలనం రేపింది. ఈ విషయం ఇప్పుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై సీఎంను కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే రెండు రోజులు ప్రయత్నించిన ఆయనకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను కలిసేందుకు మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని… సీఎం ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నా అపాయింట్మెంట్  దొరకడం లేదని తెలుస్తోంది.

మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్ సిద్దిపేట పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్కు వెళ్లారు. బుధవారం ప్రగతిభవన్ కు చేరుకున్నారు. మంత్రి ఈ రెండు రోజులపాటు ఫామ్హౌస్, ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించగా.. అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. ‘‘సర్పంచ్ కిస్తే సరిపోతదా..ఈడ ఎమ్మెల్యే, మంత్రి ఉన్నడు..పొట్టుపొట్టు చేసి ఇడ్సిపెడ్తం’’ అని మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉంది. అయితే.. తాను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారితో మాట్లాడలేదని, ఆ వాయిస్  తనది కాదని మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై  సీఎంను కలిసి సంజాయిషీ ఇచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 

మంత్రి మల్లారెడ్డికి వివాదాల్లో ఇరుక్కోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలుమార్లు ఆయన విషయాలి రచ్చకెక్కాయి. అయితే మల్లారెడ్డి తనకు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంపై సన్నిహితుల వద్ద చేసే కామెంట్స్ కూడా ప్రగతిభవన్ వర్గాలకు చేరినట్టు తెలిసింది. నాకు పోస్టు ఊరికే రాలే..ముట్టజెప్తేనే  వచ్చింది అని  ఆయన తరుచూ  మాట్లాడుతున్నట్టు నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు పార్టీ లీడర్లు చర్చించుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం మల్లారెడ్డికి కొత్తేమీ కాదని, అయితే ఈసారి మాత్రం పార్టీ పెద్దలకు సన్నిహితంగా ఉండే రియల్టర్ ను  బెదిరించడం వివాదాస్పదమైందని టీఆర్ఎస్  సీనియర్  నేత ఒకరు అభిప్రాయపడ్డారు.  మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. భూ ఆక్రమణలు, బెదిరింపులకు పాల్పడుతున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, అరెస్ట్ చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. మల్లారెడ్డిపై ఫిర్యాదులు వస్తున్నా సీఎం ఎందుకు స్పందించడంలేదని ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఎర్ర సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దీంతో ఎలాగైనా సీఎంని కలిసి తాను ఏ తప్పు చేయలేదని వివరించేందుకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement