మలయాళ నటుడు విజయ్ బాబుపై అత్యాచారం కేసు నమోదైంది. నటుడు విజయ్ బాబు తనపై నెల రోజుల పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మలయాళ చిత్ర పరిశ్రమలోని ఓ మహిళా నటి ఆరోపించింది. 2022 మార్చి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు నిందితుడు విజయ్ బాబు తనపై శారీరకంగా దాడి చేసి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. విజయ్ బాబు తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఈ నెల 22న బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తనపై జరిగిన వేధింపులకు సంబంధించి ఫేస్బుక్ పోస్టులో పూర్తి వివరాలు రాసుకొచ్చింది.
చిత్ర పరిశ్రమలో మరిన్ని మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ ఎర్నాకుళంలోని తన అపార్ట్మెంట్లో విజయ్ బాబు తనను చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేయడంతోపాటు శారీరకంగానూ హింసించినట్టు బాధితురాలు ఆరోపించింది. కాగా, ఈ విషయమై పోలీసులు ఇంకా విజయ్ బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించలేదు. విజయ్ బాబు తనకు కొన్నేళ్ల నుంచి తెలుసని, అతడితో కలిసి ఓ సినిమా కోసం పనిచేశానని బాధితురాలు తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన తనకు సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో సలహాలు ఇస్తూ, స్నేహపూర్వకంగా మెలుగుతూ నమ్మకాన్ని సంపాదించుకున్నాడని తెలిపింది. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను తనకు సంరక్షకుడిగా వ్యవహరించాడని వివరించింది. లైంగికంగా తనను వేధించాడని ఆరోపించింది.
అయితే, విజయ్ బాబు తన ఫేస్బుక్ లైవ్ పోస్ట్‌లో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తానేమీ తప్పు చేయలేదని చెప్పారు. అంతేకాకుండా, తాను పరువు నష్టం దావా వేస్తానని, ఆమెను అంత తేలిగ్గా వదిలిపెట్టను అని చెప్పాడు.