Key points:
- 2030 నాటికి దేశం నుండి మలేరియాను నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- ఇది దీర్ఘ కాలిక కార్యక్రమం కాగా ఇప్పటికి 9 కోట్లకు పైగా మస్క్యుటో నెట్స్ని పంపిణీ చేశారు.
- 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మలేరియాను ప్రధాన వ్యాధిగా గుర్తించారు.
నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యప్తంగా ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మురుగునీటి ప్రాంతాలు, లోతట్టు ఏరియాలు, నీరు నిల్వ ఉండే చోట దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతి విస్తరించే అవకాశాలున్నాయి. దీనికి ఇప్పటి నుంచే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
దేశంలో మలేరియా అనేది పేదవారికి మాత్రమే సోకే వ్యాధిగా గుర్తింపులో ఉంది. దీంతో ప్రజారోగ్య అజెండాలో తక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. మలేరియా నో మోర్ కంట్రీ డైరెక్టర్ ప్రతీక్ కుమార్ బుధవారం మీడియా సెన్సిటైజేషన్ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం నుండి మరింత చర్యలు కావాలని, దీని నివారణపై ఇంకా పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
2015 నుండి దేశంలో మలేరియా కేసుల సంఖ్య 86 శాతం తగ్గింది. 2015 నుంచి 2021 మధ్య ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య 79శాతం తగ్గిందని ఓ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. ‘మలేరియా నో మోర్’. అనే నినాదంతో 2017 నుంచి 2019 మధ్య కాలంలో పెద్ద ఎత్తు పోరాటం చేస్తున్నారు. దీంతో దేశం బడ్జెట్ కేటాయింపులు కూడా రెండింతలు పెరిగాయి. ఇది 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తించదగిన వ్యాధిగా మారింది. “ఇండియాస్ మార్చ్ టు మలేరియా నిర్మూలన” పేరుతో ఈ నివేదికను ఇవ్వాల రిలీజ్ చేశారు.
2019–2021 మధ్య కాలంలో దీర్ఘకాలిక కార్యక్రమంగా తీసుకున్న వాటిలో 9 కోట్లకు పైగా మస్క్యుటో నెట్స్ పంపిణీ చేశారు. కాగా, ప్రభుత్వం 2030 నాటికి దేశం నుండి మలేరియాను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటికీ పరిష్కరించాల్సిన కొన్ని క్లిష్టమైన సవాళ్లున్నాయి. ఈ వ్యాధికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రైవేట్ రంగం, ప్రజా సంఘాల భాగస్వామ్యం ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తోంది.
‘‘అయితే, ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ప్రభుత్వం మాత్రమే సాధించదు. సమాజంలోని అన్ని వర్గాల నుండి చురుకైన భాగస్వామ్యం ఎంతో అవసరం. మలేరియాను నిర్మూలించే ప్రయత్నంలో అందరూ చేతులు కలపాలి. తద్వారా దేశం నుండి 2030 నాటికి వ్యాధిని నిర్మూలించే లక్ష్యాన్ని సాధించగలం’’ అని కుమార్ చెప్పారు.