కరోనా థర్డ్ వేవ్‌లో పిల్లలకు ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరిక నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ టీకా వస్తే పాఠశాలలు పునఃప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ మహమ్మారి వల్ల ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందన్నారు. పాఠశాలలను పునఃప్రారంభించటంలో చిన్నారులకు టీకా అందించే ప్రక్రియ.. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారం సెప్టెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ కంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్.. చిన్నారులు కోసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లలకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నా, అసలు లక్షణాలే లేకపోయినా కూడా వారి ద్వారా ఇతరులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని గులేరియా హెచ్చరించారు. కరోనా నుంచి బయటపడాలంటే టీకా ప్రక్రియను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని గులేరియా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఫ్యాక్ట్ చెక్: ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు! నిజమేనా?