మీరు బీరు ప్రియులా? అయితే ఇది కచ్చితంగా బ్యాడ్ న్యూసే.. ఎందుకంటే మీరు రోజు తాగుతున్న బీరును మూత్రంతో తయారు చేస్తున్నారని తెలిస్తే ఏం చేస్తారు? వెంటనే వాంతి చేసుకుంటారు లేదా ఇదెక్కడి ఖర్మరా బాబూ అని బిక్కముఖం వేసి.. బ్రాండ్ మార్చేస్తారో మీ ఇష్టం. కానీ ఈ కంపెనీ తయారు చేసే బీరు మాత్రం నీళ్లతో కాకుండా యూరిన్ (మూత్రం)తో తయారు చేస్తున్నారన్నది మాత్రం నిజం.
ఓ సంస్థ తమ బీరును మూత్రంతో తయారు చేశామని, వచ్చి టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలన సగర్వంగా ప్రకటించింది. ప్రజలు కూడా దాన్ని రుచి చూసేందుకు క్యూ కడుతున్నారు. కంగారు పడకండి. మీరు ఈ బ్రాండ్ బీరును ఎప్పుడూ తాగి ఉండరు. ఎందుకంటే దీన్ని సింగపూర్‌లో తయారు చేస్తున్నారు. ఒక వేళ ఈ వార్త చదివిన వారిలో ఎవరైనా సింగపూర్‌లో ఉండి ఉంటే మాత్రం ఆ బ్రాండ్ గురించి తెలుసుకోండి. కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఆశగా ఉంటే ట్రై చేయొచ్చు..
మూత్రంతోనే ఎందుకు?
సింగపూర్‌లో నీటి కొరత తీవ్రంగా ఉండటం వల్ల ఇట్లా చేస్తున్నామని చెబుతోంది ఆ కంపెనీ. అక్కడి ప్రజల అవసరాలకు తగిన నీరు సప్లయ్ చేయడానికే ప్రభుత్వం ముప్పు తిప్పలు పడుతోందట. అలాంటిది ఇక నీటిపై ఆధారపడిన బ్రూవరీ సంస్థలకు వాటర్ సప్లయ్ చేయాలంటే పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయట. అందుకని అక్కడి సర్కారు నీటిని సేవ్ చేయాలని ప్రజలకు, సంస్థలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ స్వయంగా నీటిని తయారు చేసుకుని బీర్లు తయారు చేస్తోంది. కానీ, స్వచ్ఛమైన నీటిని ఎలా తయారు చేసుకోగలుగుతుంది? అనేగా మీ సందేహం? ఎక్కడి నుంచో కాదు మూత్రం, మురుగు నీటి నుంచి ఈ నీటిని తయారు చేసి బీరు తయారీకి వాడుతోంది.
మూత్రాన్ని శుద్ధి చేసి..
మూత్రం, మురుగు నీటిని శుద్ధి చేయగా వచ్చే నీటితో బీరు తయారు చేయడమే కాకుండా.. తాము వాటర్‌ను సేవ్ చేస్తున్నామని సగర్వంగా NEWBrew (న్యూబ్రూ) అనే సంస్థ ప్రకటించింది. బీరు తయారీకి చాలా నీరు అవసరం అవుతుంది. బీరులో సుమారు 90శాతం నీరే ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో నీటి కొరత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యూబ్రూ సంస్థ ఈ బీరు తయారీని ఆరంభించింది.
బీరు తయారీ కోసం నీటిని తయారీ చేయడం కోసం ఆ సంస్థ NEWater ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. నగరంలోని వివిధ కార్యాలయాలు, పాఠశాలలు, మాల్స్, మార్కెట్ టాయిలెట్ల నుంచి సేకరించిన మూత్రాన్ని ఇక్కడ అనేక దశల్లో ఫిల్టర్ చేస్తారు. మరోవైపు మురుగు నీటిని కూడా ఇదే విధంగా శుద్ధి చేసి.. దాన్నుంచి నీటిని సేకరిస్తారు.. ఆ నీటిలో మాల్ట్, ఈస్ట్, హాప్స్ వంటి సూక్ష్మక్రిములేవీ ఉండవు. ఈ బీరు భలే రుచిగా ఉందంటూ మందుబాబులు తెగ తాగేస్తున్నారట. కావాలంటే, మీకు సింగపూర్‌లో ఉన్న దోస్తులకు చెప్పి ఒక టిన్ తెప్పించుకుని తాగి చూడండి..