ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్ : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. మోసపోతే.. గోసపడుతాం.. ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నాం.. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం.. కేసీఆర్ కిట్ ఎలా ఉంటుందో చూశారన్నారు. హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నదన్నారు. కేసీఆర్ కిట్ కాదు.. మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్‌ను తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు. హైదరాబాద్‌కు వెళ్లే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తప్ప మరొకటి లేకుంటే. అద్భుతమైన ఐదు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నామన్నారు.
ప్రభుత్వరంగంలోనే 17వేల బెడ్స్ ఉంటే.. ప్రస్తుతం 50వేల బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా పత్రి బెడ్‌కు ఆక్సిజన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దగ్గరలోని ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎవరినో అడుగకుండా మన ఆక్సిజన్ మనమే తీసుకునే విధంగా పెట్టుకున్నామన్నారు . కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్లీ ముందు కొనసాగాలంటే.. నిన్నా మొన్న 20 రోజుల నుంచి కార్యక్రమాలు ఎలా చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవించినట్లయితే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు. కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దామన్నారు. ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ఏర్పడకూడదని మాట్లాడినటువంటి పెద్దలే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నరని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. అంటే విషయం తారుమారైంది.. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనన్నారు. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా వారిని సమైక్య శక్తులు కన్ఫ్యూజ్ చేశాయన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ధరం ఎంత ? ఆ రోజు ఎంత ఉండే ? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నదన్నారు. రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చన్నారు. ఇంకా నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందన్నారు.