దేశం నలుమూలలా పాఠశాలలను నిర్మించాల్సిన అవసరం ఉందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. మేక్ ఇండియా నెంబర్1 మిషన్ ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలన్నీ తాను చేపట్టిన మిషన్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన మిషన్ ప్రధానంగా విద్య, వైద్య, సేద్య రంగాలపై దృష్టిసారిస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా 130 కోట్ల భారతీయులను ఏకతాటిపైకి తీసుకువస్తానన్నారు.మనం 75 ఏండ్ల స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నాం..మనం ఎంతో సాధించినా ప్రజలు ఇంకా కడగండ్లకు లోనవుతూ పాలకులపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన వెంటనే ఎన్నో చిన్న దేశాలు అభివృద్ధిలో మనకంటే వేగంగా పరుగులు పెట్టాయని గుర్తుచేశారు. మనం దేశవ్యాప్తంగా 27 కోట్ల మంది చిన్నారులకు మెరుగైన, ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబానికి చెందిన ఓ చిన్నారి వారి కుటుంబాన్ని పేదరికం నుంచి సంపన్నులుగా మార్చగలడని, ఇది విద్యతోనే సాధ్యమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దీనికోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడరాదని పిలుపు ఇచ్చారు. అప్పుడే భారత్ పేరు సంపన్న దేశాల జాబితాలోకి చేరుతుందని పేర్కొన్నారు. ఇక మెరుగైన, ఉచిత వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నారు.