శ్రీరామ నవమి వేడుకల కోసం రాములోరి ఆలయాలు ముస్తాబైంది. మహబూబాబాద్ జిల్లా( మానుకోట జిల్లా) మరిపెడ మండలంలోని గుండెపురి సీతారాముల ఆలయానికి సుమారు 150ఏళ్ల చరిత్ర ఉంది. లక్ష్మణ సమేత సీతారాముల మూర్తులతో కొలువైన ఈ ఆలయంలో ప్రతీ ఏటా రాములోరి కళ్యాణం కమణీయంగా జరుగుతుంది. ఈ శుభ సందర్భాన వేలాదిగా భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి గరుడ ముద్ద కోసం చాలా మంది భక్తులు వస్తారని నానుడి. ఈ క్రమంలోనే నేటి శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి ఆలయాన్ని నిర్వాహకులు సుందరంగా ముస్తాబు చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అందున అత్యంత చారిత్రక, మహిమాన్వితమైన, మరిపెడ మండలంలోని గుండెపురి ఆలయంలో గతంలో కళ్యాణ ఉత్సవాలను పక్షం రోజులకు పైగా ఘనంగా నిర్వహించేవారు కాగా ప్రస్తుతం తొమ్మిది రోజులు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను ఆలయ ధర్మకర్త నూకల నరసింహారెడ్డి వారసులు నూకల కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 10) ఉదయం పొన్నసేవ, సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని, అనంతరం అగ్ని ప్రతిష్ఠ, పుణ్యహవాచనం, దేవాలయ బలిహరణ, గరుడ ముద్ద, రాత్రి అలక(ప్రణయ కలహం) నిర్వహించనున్నారు. మర్నాడు 11వ తేదీన అశ్వ, శేష, పల్లకీ మూడు వాహనాల్లో సీతారాముల శోభాయాత్ర గ్రామ వీధుల్లో జరుగుతుంది. 12వ తేదీన అత్యంత విశిష్టమైన రథ సేవ, 13వ తేదీన వసంతోత్సవం, సప్తవర్ణాలు, పూర్ణాహుతి, 14వ తేదీన ఏకాంత సేవ అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి.
ఆలయ ఇతివృత్తం..
గుండెపురి గ్రామానికి చెందిన ఓ రైతు నూకల నరసింహారెడ్డి ప్రతి ఏటా భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్లే వారట. ఈ క్రమంలో ఒక రాత్రి తన కలలో రాముల వారు సాక్షత్కరించి తన విగ్రహాలు తన వ్యవసాయ భూమిలో ఉన్నట్లు గోచరించగా మర్నాడు పొలం వద్ద రాతి విగ్రహాలు లభ్యమయ్యాయి. వెంటనే నరసింహారెడ్డి ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆలయ నిర్మాణం అనంతరం అప్పటి నైజాం నవాబు ఇక్కడికి సర్వమతాల వారు రాక, ఆలయ విశిష్టతను గమనించి దేవాలయానికి 50ఏకరాలు ఇనాం భూమి, ఆలయం ఎదుట సర్వమతాల చిహ్నంగా ప్రాకారంగా(ఆర్చి) నిర్మించి శిలాశాసనం రాయించారు. ఈ శిలా శాసనం ఇప్పటికి గుడిలో ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసి ఉంది.
విశిష్టతలు, నమ్మకాలు..
ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయానికి విశిష్టతలు కలవని స్థానికులు తెలుపుతుంటారు. ఏడాదిలో రెండు సార్లు ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణారాయంలో మరోమారు ఐదు రోజుల పాటు ఆలయంలో కొలువైన సీతారాములు మూర్తులపై సూర్యుడి ప్రభాత కిరణాలు సుమారు 12నిముషాల పాటు అభిషేకం చేసిన మాదిరి తల నుంచి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు ఎక్కడి నుంచి పడుతున్నాయి అన్న ప్రశ్న ఇప్పటికి అలానే ఉంది. హైదరాబాద్ నుంచి నిపుణులు వచ్చినా ఈ రహస్యాన్ని చేధించలేదని గ్రామస్థులు చెబుతుంటారు. అదే విధంగా ఈ ఆలయం ఎదుట ఉన్న 16కాళ్ల మంటపం రాష్ట్రంలోనే ఏకైక మంటపం. ఇలాంటి పదహారు కాళ్లు కలిగిన మంటపం తెలంగాణలో ఎక్కడ లేదని పూర్వికులు తెలుపుతుంటారు. ఈ మంటపంలో కళ్యాణ ఘట్టం ముగిశాక గరుడ ముద్దను గోపురం, ధ్వజస్థంబం వైపునకు విసురుతారు. ఈ గరుడ ముద్ద సంతానం లేని వారు తీసుకుంటే సంతానం కలుగుతుందని ఆలయ భక్తుల నమ్మకం. అంతే కాకుండా 2019వ సంవత్సరంలో ఈ ఆలయంలో ఓ దొంగ స్వామి కిరీటాన్ని తస్కరించగా.. ఆ మర్నాడే దొంగ ఇంట్లో అశుభం జరిగింది. దీంతో బయపడిన ఆ దొంగ స్వామి వారి మహత్యాన్ని గుర్తించి.. అపహరించిన కిరిటంతో పాటుగా తన సొంత డబ్బులతో మరో రెండు కిరీటాలు చేయించి ఆలయానికి ఇచ్చాడు. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి తెలుగు రాష్టాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఆనందంగా వెళ్తుంటారు.
శ్రీరామ నవమి అన్ని ఏర్పాట్లు చేశాం..
శ్రీరామ నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి. కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ ధర్మకర్త వారసులు, గ్రామస్థుల సహకారం అన్ని ఏర్పాట్లు చేశాం. నేటి కళ్యాణానికి గుండెపురి నుంచే కాకుండా చుట్టు పక్కల అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తారు. మొక్కిన మొక్కులు తీరతాయి అని భక్తుల విశ్వాసం అని ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల వెంకట లక్ష్మినరసింహాచారి తెలిపారు.