ముంబైలోని తాజ్‌మహల్ హోటల్లో 2008 నవంబర్ 26న జరిగిన టెర్రరిస్ట్ దాడుల్లో అనేకమంది పౌరులను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయిన వీర సైనికుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ ‘మేజర్’ అనే సినిమా చేశారు..దాన్ని మరో రెండు ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి హీరో మహేశ్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. శశికిరణ్ తిక్కా డైరెక్ట్ చేసిన ‘మేజర్స ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ ఏంటంటే.. మలయాళీ కుటుంబానికి చెందిన సందీప్ ఉన్నికృష్ణన్ తల్లితండ్రుల అభీష్టానికి విరుద్ధంగా ఆర్మీలో చేరతాడు. అతనికి అన్నింటికంటే దేశమే ముఖ్యం. ఆర్మీలో అత్యంత కీలకమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లో 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్‌కు ట్రైనింగ్ ఆఫీసర్ అవుతాడు. క్లాస్‌మేట్ ఇషాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇషా ఆర్కిటెక్ట్‌గా బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటే, సందీప్ హర్యానాలో ఉంటాడు. కొంతమంది టెర్రరిస్టులు ముంబై వచ్చి, తాజ్‌మహల్ హోటల్ సమీపంలో బాంబ్ బ్లాస్టులు చేసి, అనేకమందిని కిరాతకంగా చంపేస్తారు. చాలామంది భయంతో తలదాచుకోడానికి తాజ్‌మహల్ హోటల్‌లోకి పరుగులు పెడతారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఉగ్రవాదులు వారిలో అనేకమందిని కాల్చేస్తారు. హోటల్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. బెంగళూరుకు బయలుదేరిన సందీప్‌కు ఈ వార్త తెలియగానే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. తన స్పెషల్ యాక్షన్ గ్రూప్‌ను తీసుకొని తాజ్‌మహల్ హోటల్‌కు వెళ్తాడు. ఆ తర్వాత అతను టెర్రరిస్టులతో ఎలా తలపడ్డాడు, అందులో చిక్కుకున్న పౌరుల్ని కాపాడ్డానికి ఎలాంటి రిస్కులు చేశాడు, ఆ క్రమంలో ఎలా తన ప్రాణాల్ని పణంగా పెట్టాడనేది కథ.
చిత్రం ఎలా ఉందంటే..మేజర్ చిత్రం ఔట్‌స్టాండింగ్ ఫిల్మ్. ఒక వీర జవాను నిజ జీవిత కథను ఎక్కువ డ్రామా లేకుండా, ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, వాస్తవికంగా చూపిస్తూనే, రోమాలు నిక్కబొడుచుకొనే తీరులో అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశాల కల్పనతో, స్క్రీన్‌ప్లేతో సెల్యులాయిడ్‌పై చిత్రీకరించడం మనం తెలుగు తెరపై ఇంతదాకా చూసి ఉండలేదు. ఆ క్రెడిట్ కచ్చితంగా మేజర్‌కు దక్కుతుంది.
టెక్నీషియన్స్ ..మేజర్ చిత్రం ఇంతబాగా రావడంలో టెక్నీషియన్ల కృషి ఎంతైనా ఉంది. సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు పనితనాన్ని ఎంతైనా మెచ్చుకోవాలి. సందీప్ కథతో మనం కనెక్ట్ అవడంలో సినిమాటోగ్రఫీ పాత్ర చాలా ఉంది. అతనికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆ తర్వాత శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఏం మ్యూజిక్ ఇచ్చాడతను! టెర్రిఫిక్!! అబ్బూరి రవి సందర్భోచిత సంభాషణలు, అవినాశ్ కొల్లా ఆర్ట్ వర్క్, సెకండాఫ్‌లో సునీల్ రోడ్రిగ్స్ యాక్షన్ కొరియోగ్రఫీ.. అన్నీ అలా కుదిరాయి.
నటీనటులు..సందీప్ ఉన్నికృష్ణన్ క్యారెక్టర్‌లో అడివి శేష్ జీవించాడు. ఆ క్యారెక్టర్‌ను చాలా ముందు నుంచే ప్రేమించడం వల్లా, సందీప్ కథను పరిశోధించడం వల్లా తానే అతడిలా మారిపోయాడు. కాలేజీ స్టూడెంట్‌గా యంగ్ గా కనిపించడానికి ఏం చేశాడో కానీ, సరిగ్గా కాలేజీ స్టూడెంట్ లానే ఉన్నాడు. ఆ తర్వాత సోల్జర్ అయ్యాక.. ఓ డిగ్నిటీ వచ్చినవాడులా మారిపోయాడు. ఇషా పాత్రలో సాయీ మంజ్రేకర్ అందంగా ఉంది. కాకపోతే కొన్నిచోట్ల ఆమె హావభావాల్లో అపరిపక్వత కనిపించింది. సందీప్ తల్లితండ్రులుగా రేవతి, ప్రకాశ్‌రాజ్ పర్‌ఫెక్ట్. కొడుకు ఆనుపానులు తెలీక ఓ తండ్రి ఎలా ఆందోళన చెందుతాడో ప్రకాశ్‌రాజ్ హావభావాల్లో చూడాల్సిందే. అలాగే కొడుకు మృతి వార్తను టీవీలో చూసి, షాక్‌కు గురైన ఆ తల్లి తల్లడిల్లిపోతూ, ఆ వార్తను నమ్మకుండా కొడుకు వస్తున్నాడేమోనని రోడ్డుమీదకు పరిగెత్తే సీన్‌లో రేవతి నటన అద్భుతం! సందీప్ పై అధికారిగా మురళీశర్మ, హోటల్‌లో బందీ అయిన హైదరాబాద్ మహిళ ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ తమ పాత్రలకు అత్యుత్తమంగా న్యాయం చేశారు. మిగతా పాత్రధారులు తమ పాత్రలకు సరిపోయారు.