ముంబై : మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీ) సోమవారం తమ వినూత్నమైన, ప్రత్యేకమైన సవాల్‌తో ముందుకు వచ్చింది. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు అధిక మైలేజీ పొందండి.. లేదా ట్రక్‌ను తిరిగి ఇచ్చేయండి.. అనే సవాల్ విసిరింది. మహీంద్రా బీఎస్-6 శ్రేణి బ్లాజో ఎక్స్ హెవీ, ఫ్యూరియో ఇంటర్మీడియేట్, ఫ్యూరియో 7, జయో సహా తేలికపాటి వాణిజ్య వాహన ట్రక్‌లపై ఈ గ్యారెంటీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన శ్రేణిలో 7.2 లీటర్ ఎంపవర్ ఇంజిన్ (హెచ్‌సీవీ), ఎండీఐ టెక్ ఇంజిన్ (ఐఎల్‌ఏసీవీ) ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతికత, అతి తక్కువ యాడ్ బ్లూ వినియోగం, సాంకేతికంగా అత్యాధునిక ఆవిష్కరణలను సాధ్యం చేసేందుకు బోష్ ఆఫ్టర్ ట్రీట్‌మెంట్ సిస్టమ్, మైల్డ్ ఈజీఆర్, విప్లవాత్మక ఐమ్యాక్స్ టెలిమాటిక్స్ సొల్యూషన్ వంటివి అత్యధిక మైలేజీకి భరోసా అందిస్తున్నాయి.
పెరుగుతున్న రవాణా ఖర్చులు
రవాణాదారులకు నిర్వహణ వ్యయంలో అత్యధిక వాటా (60 శాతంకు పైగా) ఇంధన ఖర్చులే ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహీంద్రా బీఎస్ 6 ట్రక్ శ్రేణిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటో మోటివ్ సెక్టార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజెనక్రా మాట్లాడుతూ.. అధిక మైలేజీ పొందండి.. లేదా ట్రక్‌ను తిరిగి ఇవ్వండి అనే గ్యారెంటీ తేలికపాటి, మధ్య స్థాయి, భారీ వాణిజ్య వాహన పరిశ్రమలో కీలక నిర్ణయం అన్నారు. వేగంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో వినియోగదారుల ప్రతిపాదనతో ముందుకొచ్చామన్నారు. దీనికి మించిన ఉత్తమ సవాల్ లేదన్నారు. అత్యాధునికమైన సాంకేతిక వ్యవస్థతో కూడిన ట్రక్‌లను అందజేయడంలో మహీంద్రాకు ఎంతో పేరుందని తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కమర్షియల్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ బిజినెస్ హెడ్ జలజ్ గుప్తా మాట్లాడుతూ.. ఈ మైలేజీ గ్యారెంటీ.. తొలిసారి ట్రక్ బ్లాజోపై 2016లో ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ట్రక్ కూడా వెనక్కి రాలేదన్నారు. అప్పటి నుంచి తాము ఆవిష్కరించిన ప్రతీ బ్లాజో ఎక్స్, ఫ్యూరియో ఐసీవీ శ్రేణి, ఫ్యూరియో 7లు అత్యధిక ఇంధన సామర్థ్యం అందిస్తున్నాయన్నారు.