Thursday, November 21, 2024

గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్‌గోబిన్ కు దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా నిర్ధారించి డర్బన్ కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేసింది. ఎస్ఆర్ మహరాజ్‌ అనే వ్యాపారవేత్తను లతా మోసం చేసినట్లు పేర్కొంది. భారత్ నుంచి వచ్చే ఓ కన్‌సైన్‌మెంట్ నిమిత్తం కస్టమ్స్ సుంకం కోసం అడ్వాన్స్‌గా 6.2 మిలియన్ ర్యాండ్స్ వ్యాపారవేత్త నుంచి వసూలు చేశారు. ఆ కన్‌సైన్‌మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు వాటా దక్కుతుంది. కానీ, అటువంటి కన్‌సైన్‌మెంటే లేదనీ నకిలీ పత్రాలను సృష్టించి లతా ఆయన్ని మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారని తేలింది. భారత్ నుంచి మూడు కంటైనర్లు ఓడల్లో వస్తున్నట్లు ఆమె తెలిపినట్లు వెల్లడైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత 50,000 ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి బెయిల్‌పై విడుదలయ్యారు. 2015 ఆగస్టులో న్యూ ఆఫ్రికా ఎలియాన్స్ ఫుట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ ఎస్ఆర్ మహరాజ్‌ను లతా కలిశారు. వస్త్రాలు, లైనెన్, ఫుట్‌వేర్ తయారీ, దిగుమతులు సహా ఇతర వ్యాపారులకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందజేస్తుంది. వీటి ద్వారా లాభాల్లో కొంత వాటా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్ కేర్ కోసం 3 కంటైనర్లలో లైనెన్ (Linen)ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు లతా నమ్మబలికారు. దిగుమతి చేసుకునేటప్పుడు కస్టమ్స్ సుంకం చెల్లించాలని, అందుకు అవసరమైన నగదు తన దగ్గర లేదని మహరాజ్‌కు చెప్పి సాయం కోరారు.

మహారాజ్‌కు 6.2 మిలియన్ల ర్యాండ్లు అవసరమని చెప్పింది. ఆయనను నమ్మించడానికి సరుకుల కోసం సంతకం చేసిన కొనుగోలు ఆర్డర్ అనిచెప్పి నకిలీ పత్రాలు చూపించింది. నెల తరువాత సరుకు చేరుకుందని, సుంకం చెల్లించాలని నెట్‌కేర్ ఇన్‌వాయిస్, డెలివరీ నోట్‌గా పేర్కొంటూ నకిలీ ఇన్వాయిస్ పంపారు.. నేట్‌కేర్ బ్యాంక్ ఖాతా వివరాలు పంపి.. నగదు బదిలీచేయాలని కోరారు. వాటిని నిజమైనవిగా భావించిన మహారాజ్.. కోరిన మొత్తాన్ని లతాకు అందజేశారు. అయితే, కొద్ది రోజుల తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశిష్ లతా రాంగోబిన్ ప్రముఖ హక్కుల ఉద్యమకర్త ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కుమార్తే.  భారత్, దక్షిణాఫ్రికాల నుంచి పలు గౌరవ సత్కారాలను అందుకున్నారు. వారి కుమార్తె ఆశిష్ లతా మాత్రం మోసపూరిత కేసులో దోషిగా తేలి జైలుపాలయ్యారు.

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ కేబినెట్ మీట్.. లాక్ డౌన్ పై చర్చ..

Advertisement

తాజా వార్తలు

Advertisement