మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు.ఆయనతో గవర్నర్ సీఎంగా ప్రమాణస్వీకారాన్ని చేయించారు.కాగా ఒక్కోసారి ఊహించనివి జరుగుతుంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో..ఇప్పుడదే జరిగింది ఏక్ నాథ్ షిండే విషయంలో.మహారాష్ట్రలోని ఎక్కడో మారుమూలపల్లెలో నిరుపేద మరాఠా కుటుంబంలో జన్మించారు షిండే. జీవనోపాధి కోసం కుటుంబం థానేకు తరలిరాగా… బాల్యమంతా కష్టాలతోనే కొనసాగించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా జవాలీ తాలూకాలోని ఓ గ్రామంలో మరాఠా కుటుంబంలో 1964 ఫిబ్రవరి 9న షిండే జన్మించారు. ఆ కుటుంబం తమ జీవనోపాధి కోసం షిండే చిన్నగా ఉన్నప్పుడే థానేకు వలస వచ్చింది.
ఈ క్రమంలో బాల్ థాకరే ఉపన్యాసానాలకు ఆకర్షితుడైన షిండే 1980లో శివసేనలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. శివసేన థానే నగర కమిటీ అధ్యక్షుడు ఆనంద్ దిఘేకు ముఖ్య అనుచరుడిగా మారిపోయారు. 1997లో థానే నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో శివసేన తరఫున కార్పొరేటర్‌గా విజయం సాధించారు. రాజకీయాల్లో దూసుకుపోతున్న సమయంలోనే షిండేకు పెద్ద కష్టమే వచ్చి పడింది.2000 జూన్ 2న షిండే స్వగ్రామానికి వెళ్లిన ఆయన ఇద్దరు కుమారులు దీపేశ్(11), శుభద (7) బోటు షికారుకు వెళ్లారు. వారెక్కిన బోటు బోల్తా కొట్టడంతో నీటిలో మునిగి వారిద్దరూ చనిపోయారు. ఈ షాక్‌తో షిండే డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. నెలల తరబడి బయటకే రాలేకపోయారు. ఈ క్రమంలో ఆనంద్ దిఘే ఆయనను డిప్రెషన్ నుంచి బయటపడేలా చేశారు. ఆ మరుసటి ఏడాది 2001లో ఆనంద్ దిఘే మరణంతో ఖాళీ అయిన థానే శివసేన అధ్యక్ష బాధ్యతలను షిండే చేపట్టారు.
షిండేకు మొత్తం ముగ్గురు కుమారులు కాగా… మూడో కుమారుడు శ్రీకాంత్ షిండే మెడిసిన్ చదివారు. శ్రీకాంత్ కూడా తండ్రి బాటలోనే నడిచి కల్యాణ్ లోక్ సభ స్థానం నుంచి 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మరోమారు అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో థానే పరిధిలోని కొప్రి పచ్‌పకడీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున బరిలోకి దిగిన షిండే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై షిండే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కొప్రి నుంచే ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్నటి వరకు ఉద్ధవ్ థాకరే కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ కేబినెట్లోనూ షిండే పూర్తి కాలం మంత్రిగా పనిచేశారు. తాజాగా మహారాష్ట్ర సీఎంగా షిండే గురువారం రాత్రి పదవీ ప్రమాణం చేశారు. ఇలా షిండే జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి.