Tuesday, November 26, 2024

Spl Story: ‘మహా’సంక్షోభం.. బీజేపీ రాజకీయ డ్రామాలతో ఆందోళనలో అధికార పక్షం

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహా వికాస్​ అఘాడి’ ప్రభుత్వం అనిశ్చితికి లోనవుతోంది. బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాలకు ఆ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు గుజరాత్​లో క్యాంప్​ నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. శివసేన ప్రభుత్వం పడిపోతుందా అన్న అనుమానాలు కూడా పొలిటికల్​ అనలిస్టుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే గుజరాత్‌లో క్యాంప్ చేస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఎంవీఏ ప్రభుత్వ స్థిరత్వంపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో చిన్న పార్టీలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల స్టాండ్ ఇప్పుడు కీలకంగా మారనుంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర శాసనసభలో శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఇక.. సాధారణ మెజారిటీతో అధికారంలో ఉండాలంటే ఏదైనా పార్టీ లేదా కూటమికి 144 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.

మహా వికాస్ అఘాడి (MVA-శివసేన, NCP , కాంగ్రెస్‌లతో కూడిన) ప్రభుత్వం నవంబర్ 30, 2019న అసెంబ్లీలో విశ్వాసం పొందింది. 169 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణానికి అనుకూలంగా మద్దతు తెలిపారు. ప్రస్తుతం శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. 2019లో బీజేపీ 105 సీట్లు గెలుచుకుంది. అయితే ఉప ఎన్నికలో NCP నుండి పంఢర్‌పూర్ అసెంబ్లీ స్థానాన్ని చేజిక్కించుకున్న తర్వాత దాని సంఖ్య 106కి పెరిగింది.

కాగా, సభలో 13 మంది స్వతంత్రులున్నారు. వారిలో ఒకరు – రాజేంద్ర పాటిల్ యెడ్రావ్కర్ – శివసేన కోటా నుండి MVA ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా.. నెవాసా నుండి క్రాంతికారి షెత్కారి పక్ష్ ఎమ్మెల్యే శంకర్రావు గడఖ్, ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన బచ్చు కడు కూడా శివసేన కోటా నుండి మంత్రులుగా ఉన్నారు. ప్రహార్ జనశక్తి పార్టీకి సభలో ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.

13 మంది ఇండిపెండెంట్లలో ఆరుగురు బీజేపీకి మద్దతుదారులుగా ఉన్నారు. మరో ఐదుగురు శివసేనకు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ మరియు ఎన్‌సీపీ ఒక్కొక్కరి మద్దతును పొందాయి. వినయ్ కోర్ (జనసురాజ్య శక్తి పార్టీ) మరియు రత్నాకర్ గుట్టే (రాష్ట్రీయ సమాజ్ పక్ష్) కూడా BJPకి సపోర్ట్​ చేస్తున్నారు. అంతేకాకుండా దేవేంద్ర భుయార్ (స్వాభిమాని పక్షం), శ్యాంసుందర్ షిండే (PWP) NCPకి సపోర్ట్​గా నిలుస్తున్నారు.

- Advertisement -

ఈ నెల ప్రారంభంలో మహారాష్ట్ర నుండి ఆరు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో AIMIM, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వగా, బహుజన్ వికాస్ అఘాడి (BVA) యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలు BJPకి మద్దతు ఇచ్చారు. ఇట్లా ఇప్పుడు మహారాష్ట్రలో ఎప్పుడు ఏం జరుగుతుందో, బీజేపీ రాజకీయ డ్రామాలకు శివసేన అధికారం కోల్పోయే పరిస్థితి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏక్​నాథ్​ షిండే
Advertisement

తాజా వార్తలు

Advertisement