మహాదేవపూర్, (ప్రభ న్యూస్ ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సూరం మహేశ్‌రెడ్డి మహరాష్ట్రలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. చివరిసారిగా మహేష్‌రెడ్డి ఫోన్ లో తన బావమరిదితో మాట్లాడాడు. ఇంటి వద్ద ఉన్న బైక్ తీసుకెళ్లాలని సూచించాడు. మరికొద్దిసేపటికే మహేష్‌రెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మహేష్‌రెడ్డి ఏడుపు వినిపించింది.. అంతలోనే ఫోన్ కాల్ కట్ కావడం, ఆ తర్వాత నుంచి ఫోన్ రీచ్ కాకపోవడం కుటుంబ సభ్యుల్లో ఆందోళన కలిగించింది. అతని ఫోన్ నుండి ఫోన్ పే ద్వారా రూ.1,20,000 కట్ అయ్యాయి. సంఘటన తీరును బట్టి చూస్తే మహేష్ రెడ్డిని ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ఈమేరకు మహేష్ రెడ్డి భార్య శైలజ మహదేవ్‌పూర్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూరారం గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత పనిమీద మహారాష్ట్రకు వెళ్లి కొత్తపల్లిలో అదృశ్యమైనట్లు శైలజ ఫిర్యాదులో పేర్కొంది. మహేష్‌రెడ్డి స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటాడని తెలుస్తోంది. అంతేకాక గతంలో ఆయనపై మావోయిస్టులు పోస్టర్లు కూడా రిలీజ్ చేసినట్లు గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. దీంతో కిడ్నాప్ చేసి ఉంటే ఎవరు చేసి ఉంటారన్నదానిపై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ జరిగి ఉంటుందా..? మరేదైనా సంఘటన జరిగి ఉంటుందా..? అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సేల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చూస్తే ములుగు జిల్లా తాడ్వాయి లొకేషన్ చూపిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహాదేవపూర్ ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు.