Friday, November 22, 2024

జిగురు రూపంలో బంగారం..ఎక్క‌డో తెలుసా..

నిధుల కోసం..బంగారంకోసం..బొగ్గుకోసం ఇలా ప‌లు అవ‌స‌రాల కోసం భూమిని తెగ తవ్వేస్తుంటారు.దీని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో ముప్పు. దీనికి తోడు భూమి కూడా కుంగిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. అయితే తవ్వ‌కుండా ఎలా తీయ‌టం అనుకుంటున్నారా..జిగురు ద్వారా కూడా తీయొచ్చ‌ని మీకు తెలుసా..ఇంత‌కీ ఎక్క‌డ జిగురుగా వ‌స్తుంద‌నుకుంటున్నారా..స్పెయిన్ లో. టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వత సానువుల మధ్య.. 4,00,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన ప్రాంతం పర్వతాల లోపలి వరకు చొచ్చుకుని ఉంటుంది. సూర్య కిరణాలు కూడా చొరబడలేనంత దట్టమైన ఈ అడవులలో హైకింగ్‌కు స్థానికులు, సందర్శకులూ ఇష్టపడతారు. సరైన సమయంలో ఇక్కడకు వచ్చి నిశితంగా పరిశీలిస్తే, కొన్ని శతాబ్దాల నాటి పురాతన ఆచారాన్ని కొనసాగిస్తున్న కార్మికులు పైన్ చెట్ల నుంచి ద్రవ రూపంలోని బంగారం జిగురిని సేకరిస్తుంటారు.

పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉంది. ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్‌లోని ఓ ప్రావిన్స్ ప్రజలు భావిస్తారు. స్పెయిన్ వాయువ్య భాగంలో విస్తరించి ఉన్న కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతం పర్వత శ్రేణులు, ఎత్తైన పీఠభూములు, మధ్యయుగం నాటి పట్టణాలతో ఉంటుంది. ఇక్కడుండే కోటలు, చర్చిల సౌందర్యాన్ని చూసేందుకు చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. అంతేనా ఎత్తైన ప్రాంతాల్లో ఉండే మెసెట మైదానాలు కనుచూపు మేరా విస్తరించి ఉంటాయి. కానీ సెగోవియా, అవిలా, వాలాడోలిడ్ ప్రావిన్సులలో మాత్రం పూర్తిగా భిన్నమైన భూభాగం కనిపిస్తుంది.

స్పెయిన్‌లో, మధ్యధరా ప్రాంతాల్లో.. నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు దీనిని వాడుతున్నారు. కానీ కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో పైన్ చెట్ల నుంచి జిగురును సేకరించడం 19, 20వ శతాబ్దాల వరకూ కూడా లాభదాయకం కాలేదని మాడ్రిడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో ఫారెస్ట్రీ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అలెజాన్డ్రో చోహాస్ చెప్పారు. 19వ శతాబ్దపు మధ్యలో ఈ చెట్ల నుంచి తీసే చిక్కటి జిగురుతో ప్లాస్టిక్, వార్నిష్, టైర్లు, జిగురు, రబ్బరు, టర్పెంటైన్ తయారు చేసేవారు. పైన్ అడవుల యజమానులు దీనినో అవకాశంగా చూశారు. దాంతో, ఆ ప్రాంతంలో ఉన్న పైన్ చెట్ల నుంచి ఈ విలువైన ద్రవాన్ని సేకరించేందుకు పనివాళ్లను తీసుకొచ్చారు.

జిగురు సేకరించే పని ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఆపేశారు. కానీ కాస్టిల్లా వై లీయోన్‌లో మాత్రం చెట్ల నుంచి జిగురును సేకరించే పని గత పదేళ్లలో పునరుజ్జీవం పొందింది. యూరప్‌లో ఎక్కడా లేనంతగా ఈ ప్రాంతంలో రెసిన్ ఉత్పత్తిదారులు ఉన్నారు. ఇప్పటికీ చెట్ల నుంచి జిగురును సేకరిస్తున్న పనిని కొనసాగిస్తున్న ఆఖరి ప్రాంతం కూడా ఇదే అని చెప్పవచ్చు.మరియానో గోమెజ్ అవిలా ప్రావిన్సులో జన్మించారు. ఆయన 32 ఏళ్లుగా ఈ పైన్ చెట్ల నుంచి రెసిన్ తీసే పనిలో ఉన్నారు. గోమెజ్‌తో పాటూ ఇతర స్థానికులు కూడా వారి పూర్వీకులు వాడిన గొడ్డళ్లను, ఇతర పరికరాలనూ వారిళ్ళల్లో ఇప్పటికీ గుర్తుగా పెట్టుకున్నారు.

ఈ పరిశ్రమ మొదలైనప్పటి నుంచీ చెట్ల నుంచి రెసిన్ సేకరించే విధానంలో ఎలాంటి మార్పులూ రానప్పటికీ, ఆధునిక ఉత్పత్తిదారులు రెసిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు మాత్రం కొత్తకొత్త పరికరాలను మాత్రం కనిపెట్టారు. దాంతో, రెసిన్ ఉత్పత్తి, ఉత్పాదకత బాగా పెరిగింది. గతంలో కొన్ని పాత పద్ధతుల్లో రెసిన్ తీసేందుకు చెట్లను గొడ్డళ్లతో కొట్టే సమయంలో అవి చనిపోతూ ఉండేవి. కానీ, ఇప్పుడు అతి తక్కువ గాట్లు పెట్టి చెట్టుకు హాని జరగకుండా చూస్తున్నారు. మార్చి నుంచి నవంబరు వరకు స్థానిక ఉత్పత్తిదారులు పైన్ వృక్షాల బెరడును జాగ్రత్తగా తొలగించి రెసిన్ తీస్తారు. ఆ తర్వాత చెట్టు మొదలుకు ఒక ప్లేటును, రెసిన్ సేకరించేందుకు ఒక కుండను తగిలిస్తారు. ఆ తర్వాత బెరడుకు గాట్లు పెడతారు. దాంతో, చెట్ల నుంచి వచ్చే రెసిన్ ఆ కుండల్లోకి చేరుతుంది. కుండలు నిండిన తర్వాత దానిని 200 కేజీల కంటైనర్లలోకి వంపుతారు.

- Advertisement -

ఈ కంటైనర్లను ఫ్యాక్టరీలకు పంపి డిస్టిలేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అందులో ఉండే టర్పెంటైన్‌ను వెలికి తీస్తారు.టర్పెంటైన్‌ను తొలగించిన తర్వాత ఇది పసుపు రంగులోకి మారి గట్టిగా మారిపోతుంది. అప్పుడిది మెరిసే పసుపు వర్ణంలో ఉండే రాళ్ళలా తయారవుతుంది.1961లో స్పెయిన్‌లో రెసిన్ సేకరణ అత్యధిక స్థాయిలో ఉన్న సమయంలో ( 55,267 టన్నుల రెసిన్‌ను వెలికితీసినప్పుడు) అందులో 90 శాతం కాస్టిల్లా వై లీయోన్ అడవుల నుంచే ఉత్పత్తి అయింది.అప్పటి నుంచీ దీనికి డిమాండ్, ధరలు కూడా తగ్గిపోవడంతో క్రమేపీ ఉత్పత్తి తగ్గు ముఖం పట్టింది. 1990లలో అయితే రెసిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో, చాలా మందికి ఈ స్పానిష్ ఆచారం అంతరించిపోతుందేమోననే అనుకున్నారు. కాస్టిల్లా వై లీయోన్ ప్రాంతంలో గ్రామీణ ప్రజలకు రెసిన్ అనేది కేవలం ఆర్థిక జీవనాడి మాత్రమే కాదు. ఇది కొన్ని తరాల నుంచీ వారసత్వంగా వచ్చిన వ్యాపారం కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement